Megastar Chiranjeevi Special Interview: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్‌ఫాదర్'. అక్టోబరు 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవిని యాంకర్ శ్రీముఖి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..
హీరోయిన్, పాటలు లేని కథని ఎంపిక చేసుకోవడానికి కారణం?
చిరంజీవి:నేనెప్పుడూ కొత్తదనం ఉన్న కథలను ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటా. ఇంత సీనియారిటీ, ఇమేజ్ ఉన్న నేను వైవిధ్యాన్ని ఎందుకు ప్రదర్శించకూడదనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో 'లూసీఫర్' సినిమా చూశా. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం అందులో ఉందనిపించింది. నాకు బాగా కావాల్సిన వారితో నా మనసులో మాట చెప్పగానే అంతా ప్రోత్సహించారు. హీరోయిన్ లేదేంటి? పాటలు లేవేంటి? అనే ప్రస్తావనే రాని పొలిటికల్ డ్రామా ఇది. సీన్ తర్వాత సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తూ సినిమా ముందుకెళ్తుంది తప్ప ఎక్కడా 'ఏదో మిస్ అయ్యిందే' అనే ఫీలింగే కలగదు. ఆ ధైర్యంతోనే ఈ సినిమాను ఎంపిక చేసుకున్నా. ఇటీవల రషెస్ చూశా. నా ఊహ, అంచనాలు తప్పుకాదని, నేను కరెక్ట్ అని అర్థమైంది.
ఈ సినిమాలోని లుక్ కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
చిరంజీవి: జీవితాన్ని కాచి వడపోసిన వ్యక్తిత్వం ఈ చిత్రంలోని కథానాయకుడి పాత్రది. ఆ అనుభవం నడి వయుసు దాటాకే వస్తుంది. ఆ ఏజ్ గ్రూప్ వారికి 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్ ఉంటేనే నిండుగా ఉంటుందని చిత్ర బృందానికి చెప్పా. ఈ విషయంలో అందరూ నన్ను అభినందించారు. అలా.. కొత్త లుక్ ప్రయత్నించా. ఇలా కనిపించటం నా కెరీర్‌లో ఇదే తొలిసారి.
ఈ చిత్రంలో నటించిన నయనతార గురించి చెబుతారా?
చిరంజీవి: 'గాడ్ ఫాదర్'లో సత్యప్రియ అనే పాత్ర చాలా కీలకం. ఎంతో బలమైన, హుందాగా కనిపించాల్సిన ఆ క్యారెక్టర్‌ను పోషించగల సీనియర్ నటి ఎవరా? అని అనుకోగానే అందరూ చెప్పిన పేరు నయనతార. మేం ఆమెను సంప్రదించి, కథ చెప్పగానే నటించేందుకు ఓకే చెప్పింది. పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
సత్యదేవ్ ఎంపిక ఎవరిది?
చిరంజీవి: సత్యదేవ్‌ను నేనే ఎంపిక చేశా. సుమారు 10 సినిమాలే చేసినా ఆయన నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది. తన హావభావాలు, ఉచ్చారణ అద్భుతంగా ఉంటాయి. ''గాడ్ ఫాదర్'లోని ప్రతినాయక ఛాయలున్న పాత్ర గురించి వివరిస్తూ.. హీరోగా చేస్తున్నావ్ కదా. ఇప్పుడిది చేస్తావా? అభ్యంతరం ఉంటే చెప్పు' అని నేను అనగానే తప్పకుండా చేస్తానన్నాడు సత్యదేవ్. ఈ సినిమాతో తనకు మంచి పేరొస్తుంది. నా పేరు నిలబెడతాడు. దర్శకుడు మోహన్‌రాజా నా ఎంపికను మెచ్చుకున్నాడు.