Chiranjeevi pawankalyan : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'భోళాశంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజమ్‌ను అనుకరించారని, ఆయన సన్నివేశాలను రీక్రియేట్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆయన.. 'చిరు లీక్స్' పేరుతో సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ తన సినిమాలకు సంబంధించిన కబుర్లను సరదాగా చెబుతుంటారు. అలానే ఇప్పుడు మరోసారి తన కొత్త చిత్రం భోళాశంకర్ గురించి చెప్పారు. సినిమాలోని ఓ సీన్‌ను షేర్ చేస్తూ దాని వెనక సంగతుల్ని వివరించారు.
chiranjeevi bhola shankar movie : "కల్యాణ్‌బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకొస్తూ, నా డ్యాన్సులకు స్టెప్పులేస్తుంటాడు. నా డైలాగులను అనుకరిస్తూ వినోదం పంచుతుంటాడు. అలా నేను కూడా 'భోళాశంకర్'లో తన మేనరిజమ్స్, తన పాటను అనుకరించి వినోదం పంచుతా. ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా" అని చిరు అన్నారు. అలాగే 'ఖుషి' సినిమాలోని 'యే మేరా జహా...' సాంగ్‌లో పవన్ మేనరిజమ్‌ను అనుకరించిన ఓ సీన్‌ను పంచుకున్నారు. 'తమ్ముడి పాట మస్తుందిలే...' అంటూ ఆ వీడియోలో చిరంజీవి.. రష్మితో కలిసి సందడి చేశారు. అది అభిమానుల్ని తెగ అలరిస్తోంది. ఇకపోతే మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'భోళాశంకర్' సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కీర్తిసురేశ్ చిరుకు చెల్లెలుగా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో 'ఖైధీ నెం.150'తో సూపర్ సక్సెస్‌ను అందుకున్న ఆయన ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి'తో యావరేజ్ హిట్‌ను దక్కించుకున్నారు. అనంతరం రామ్‌చరణ్‌తో కలిసి చేసిన 'ఆచార్య' భారీ డిజాస్టర్‌ను అందుకుంది. దీంతో ఎలాగైనా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్న చిరంజీవి.. 'గాడ్‌ఫాదర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది మంచి విజయాన్ని సాధించింది. కానీ ఈ సక్సెస్ మెగాస్టార్ రేంజ్ కాదు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి తన స్టార్డమ్కు తగ్గటు భారీ హిట్‌ను అందుకున్నారు. రూ.200కోట్ల క్లబ్ హీరోగా మారిపోయారు. అలా 'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీరయ్య'తో బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న ఆయన.. ఇప్పుడు 'భోళాశంకర్'తో మరి సక్సెస్‌ను ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేయాలని ఆశిస్తున్నారు.