టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తన తనయుడు రామ్‌చరణ్ నటన గురించి అందరూ మెచ్చుకుంటుంటే ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు! తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ను ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుతమని కొనియాడారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ గురించి ఆయన ప్రస్తావించారు. దీంతో మెగాస్టార్ తెగ సంబరిపోడిపోయారు. కామెరూన్ మాట్లాడిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
"ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్ పాత్రను జేమ్స్ కామెరూన్ సర్ ప్రస్తావిస్తూ మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ అయిన ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే. రామ్‌చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? అని ఒక తండ్రిగా నేను ఎంతో గర్వపడుతున్నా. కామెరూన్ అభినందనలే చరణ్‌కు దీవెనలు.. బంగారు భవిష్యత్‌కు మెట్లు" అని చిరు ట్వీట్ చేశారు.
అసలు జేమ్స్ కామెరూన్ ఏమన్నారంటే?
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. ఓ ఛానెల్లో మాట్లడుతూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ఆర్‌ఆర్‌ఆర్ అద్భుత చిత్రం. తొలిసారి సినిమా చూసినప్పుడు ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. సినిమాలోని పాత్రలు, వీఎఫ్‌ఎక్స్, కథను చెప్పిన విధానం అంతా షేక్‌స్పియర్ క్లాసిక్‌లా అనిపించింది. సినిమాకు సంబంధించి రామ్ పాత్ర చాలా ఛాలెంజింగ్. ఆ పాత్ర మైండ్‌లో ఏముంది? అని తెలిసిన తర్వాత నిజంగా గుండె బద్ధలైంది. ఇటీవల రాజమౌళిని స్వయంగా కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా" అంటూ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట నామినేట్ అయింది.