ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారలుగా తెరకెక్కిన సినిమా 'రంగమార్తాండ'. ఉగాది పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమాను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చూశారు. తనకు ఏమనిపించిందో సోషల్ మీడియాలో వివరించారు.
'త్రివేణీ సంగమంలా అనిపించింది!'
''నేను 'రంగమార్తాండ' సినిమా చూశాను. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఇది ఒకటి. ప్రతి నటుడికి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఓ త్రివేణీ సంగమంలా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం.. ముఖ్యంగా ఆ ఇద్దరి నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చేయడం తొలిసారి అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. సెకండ్ హాఫ్ అంతా అప్రయత్నంగానే కంటతడి నిండిందని ఆయన తెలిపారు. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇటువంటి సినిమాలు అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కృషవంశీ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ.. చిత్రబృందం అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
'రంగమార్తాండ'లో బ్రహ్మానందం నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందని నెట్టింట అనేకమంది అభిమానులు చెబుతున్నారు. తెలుగులో సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. మెజారిటీ సినిమాల్లో ఆయన కామెడీనే పండించారు. అటువంటి ఆయనలో సీనియర్ నటుడిని కృష్ణవంశీ తెరపై ఆవిష్కరించారు. వినోదం కాకుండా నటనతో బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఆయన నటన తమ గుండెలను కదిలించిందని చాలా మంది చెబుతున్నారు. సామాన్యులతో పాటు స్టార్ హీరోలను సైతం బ్రహ్మానందం నటనకు ఆకర్షితులవుతున్నారు.
హాస్య బ్రహ్మకు చిరు, చరణ్ సత్కారం
బ్రహ్మానందం నటించిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆయనను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు.
హౌస్ ఫుల్ మూవీస్, రాజ్య శ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు రాయగా.. లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. లక్ష్మీ భూపాల రాసిన షాయరీకి చిరంజీవి తన గళం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'రంగమార్తాండ' థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదల అయింది. ఉగాది కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.