KGF 2 Movie Editor: దర్శకుడు ఓ సినిమా ద్వారా చాలా చెప్పాలనుకుంటాడు. కానీ, నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులకు కథ రుచించకపోవచ్చు. అందుకే వారికి ఎప్పుడు? ఎంత? ఎలా చెప్పాలో, చూపించాలో ఎడిటరే నిర్ణయిస్తాడు. సినిమా జయాపజయాల విషయంలో కీలక బాధ్యత తీసుకుంటాడు. అయితే తాజాగా విడుదలైన 'కేజీఎఫ్ 2' సినిమా సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కథ, నటీనటుల యాక్టింగ్,బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా సినిమా చూపించిన విధానం (ఎడిటింగ్) మరింత బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రానికి ఎడిటర్ ఎవరు అనే ఆసక్తి సినీప్రియుల్లో మొదలైంది. ఈ క్రమంలోనే దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. ఓ 20ఏళ్ల కుర్రాడు ఎడిటర్‌గా వ్యవహరించాడని తెలిసింది. అవును మీరు విన్నది నిజమే. దీని గురించి తెలిసిన చాలా మంది ప్రేక్షకులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఉజ్వల్ కులకర్ణి అనే టాలెంటెడ్ యంగ్‌స్టర్ ఈ సినిమాకు ఎడిటింగ్ చేశాడు. గతంలో యూట్యూబ్ వీడియోలు, ఫ్యాన్ మేడ్ వీడియోలు ఎడిట్ చేసేవాడు. కొత్త వారికి ప్రోత్సాహమిచ్చేందుకు ఎప్పుడూ ముందుండే దర్శకుడు ప్రశాంత్ నీల్.. అతడి గురించి తెలుసుకుని, పనితీరును మెచ్చి ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్లే హాలీవుడ్ రేంజ్లో తన పనితనాన్ని నిరూపించుకున్న ఉజ్వల్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.
ఈ నేపథ్యంలోనే 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. తనకు దక్కిన ఈ గౌరవానికి ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు ఉజ్వల్. ప్రశాంత్ నీల్ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. "నేను హీరో యశ్‌కు వీరాభిమానిని. 'కేజీఎఫ్ 1' సినిమా నాకు చాలా నచ్చింది. ఆ సమయంలో పీయూసీ చదువుతున్నాను. నా పెద్ద అన్న సినిమాల్లోకి వెళ్లమని సూచించారు. అప్పుడు ఎడిటింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. అలా ఈ రంగంలోకి వచ్చాను. నేను ఎడిట్ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఆయన భార్య లిఖిత చూపించారు. అది చూసి ప్రశాంత్ నాకు 'కేజీఎఫ్ 2' సినిమాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో నాకు 17ఏళ్లు. ఆయన నన్నెంతగానో ప్రోత్సాహించారు. ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అది నా అదృష్టం. అయితే అప్పుడు మా తల్లిదండ్రులు నాపై కోపంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఉన్నత విద్యను అభ్యసించలేదు. కానీ ఇప్పుడు వారు నాపట్ల ఎంతో గర్వంగా, సంతోషంగా ఉన్నారు." అని ఉజ్వల్ అన్నాడు.