Martin Luther King Movie Review : చిత్రం: మార్టిన్ లూథర్ కింగ్; నటీనటులు: సంపూర్ణేష్ బాబు, నరేశ్, శరణ్య ప్రదీప్, వెంకటేశ్ మహా తదితరులు; కథ: మడోన్ అశ్విన్; సంగీతం: స్మరణ్ సాయి; ఛాయాగ్రహణం: దీపక్ యరగెరా; దర్శకత్వం: పూజ కొల్లూరు; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వెంకటేశ్ మహా; నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర; విడుదల తేదీ: 27-10-2023.
దసరా పండుగ సందర్భంగా గత వారమంతా థియేటర్లలో పెద్ద చిత్రాలు సందడి చేశాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న సినిమాలు తెరకెక్కాయి. అలా బాక్సాఫీస్ ముందుకొచ్చి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్టిన్ లూథర్ కింగ్'. తమిళంలో సూపర్‌హిట్ టాక్ అందుకున్న 'మండేలా'కు రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. మాతృకలో కమెడియన్ యోగిబాబు పోషించిన పాత్రను తెలుగులో సంపూర్ణేశ్ బాబు చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
స్మైల్ (సంపూర్ణేశ్ బాబు) ఓ అనాథ. పడమరపాడు అనే గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఆ ఊరిలో ఉన్న ఓ మర్రి చెట్టే అతని నివాసం. ఊరి వాళ్లంతా తనని ఎడ్డోడు.. వెర్రిబాగులోడు.. అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న పనులు చేయాలంటే అతడ్నే పిలుస్తుంటారు. వాళ్లిచ్చే చిల్లర డబ్బులతోనే స్మైల్ పూట గడిపేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ చిన్న చెప్పుల షాప్ పెట్టుకోవాలన్నది అతని కల. దాని కోసం రూపాయి రూపాయి పోగు చేసుకుంటుంటాడు. అయితే ఓ రోజు ఆ సొమ్మును ఎవరో దోచుకుంటారు. దీంతో తన స్నేహితుడు బాటా సలహా మేరకు ఇకపై పోస్టాఫీసులో డబ్బును దాచుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం పోస్టాఫీస్‌లో పని చేసే వసంత (శరణ్య ప్రదీప్)ను సాయం కోరతాడు. అయితే పోస్టాఫీస్‌లో అకౌంట్ తెరవాలంటే స్మైల్‌కు ఎటువంటి గుర్తింపు కార్డు ఉండదు. అసలు స్మైల్ అసలు పేరేంటో కూడా ఎవ్వరికీ తెలియదు. దీంతో వసంతే అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అనే కొత్త పేరును పెట్టి.. పోస్టాఫీస్‌లో ఓ ఖాతాను తెరుస్తుంది. అలాగే తన పేరిట ఓ ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు.. ఇలా అన్నింటికీ అప్లై చేస్తుంది.
మరోవైపు పడమరపాడులో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దక్షిణం దిక్కుకు పెద్దగా వ్యవహరించే లోకి (వెంకటేశ్ మహా), ఉత్తరం దిక్కుకు నాయకుడిగా వ్యవహరించే జగ్గు (నరేశ్) సర్పంచ్ పదవి కోసం పోటీ పడతుంటారు. అయితే వారు చేసిన సర్వేలో ఇద్దరికీ సమాన ఓట్లు పడనున్నట్లు ముందే తెలిసిపోతుంది. వీరిలో ఎవరికి మరొక్క ఓటు పడినా సర్పంచ్ పదవితో పాటు రూ.30కోట్ల భారీ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ఒక్క ఓటు కోసం జగ్గు, లోకి వేట మొదలు పెడతారు. అదే సమయంలో మార్టిన్ లూథర్ కింగ్‌కు ఓటు హక్కు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో లోకి, జగ్గు అతణ్ని తమవైపు తిప్పుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి మార్టిన్‌కు ఓటు హక్కు రావడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? జగ్గు, లోకిల వల్ల తనెలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తన ఓటుతో ఊరిని ఎలా మార్చాడు? అన్నదే మిగతా స్టోరీ.
ఎలా సాగిందంటే:
ఓటు విలువని తెలియజెప్పే కోణంలో ఈ సినిమా సాగింది. అంతర్లీనంగా సమాజంలో ఉన్న అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుంది. అలాగే వర్తమాన రాజకీయాలపై ఓ విమర్శనాస్త్రంగా ఉంటుంది. ఇది రీమేక్ చిత్రమైనప్పటికీ తెరపై చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ఎక్కడా కలగదు. మాతృకలోని ఆత్మను దెబ్బ తీయకుండా వెంకటేశ్ మహా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగానే కథను చక్కగా మలిచారు. దాన్ని దర్శకురాలు పూజ కూడా అంతే నిజాయతీగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు కాస్త కమర్షియల్ హంగులు జోడించి తెరపై చూపించగలిగినప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయంలో మార్టిన్ కొంచం వెనకబడినట్లు అనిపిస్తుంది.
Martin Luther King Telugu Review : పడమరపాడు గ్రామం.. అక్కడి ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేస్తూ వచ్చే ఆరంభ సన్నివేశాలు బాగుంటాయి. ఈ క్రమంలో వచ్చే మరుగుదొడ్డి ఓపెనింగ్ ఎపిసోడ్.. అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు వర్గాలు తలపడే తీరు ఆడియెన్స్‌ను నవ్విస్తాయి. ఆ వెంటనే స్మైల్ ప్రపంచాన్ని.. ఆ ఊరి ప్రజలు అతనితో వ్యవహరించే విధానాన్ని చూపిస్తూ నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకురాలు. స్మైల్ డబ్బుల్ని ఎవరో దొంగలించడం.. దీంతో తను డబ్బులు దాచుకునేందుకు పోస్టాఫీస్‌లోకి అడుగు పెట్టడం.. ఆ తర్వాత తనకు వసంతతో పరిచయమవడం.. ఆమె అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టడం.. ఇలా స్టోరీ క్రమ క్రమంగా ఓ చిన్న మలుపు తిరుగుతుంది. పడమరపాడులో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఊర్లోని ఓటర్లను ఆకర్షించేందుకు లోకి, జగ్గు డబ్బులతో ప్రలోభ పెట్టే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ విషయాల్లో నాయకులు ప్రజల్లోని సెంటిమెంట్‌ను ఎలా అడ్డం పెట్టుకుంటారన్నది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. దీనికి తోడు జగ్గు, లోకి పాత్రలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకుల్ని గుర్తు చేసేలా ఉండటం వల్ల వాటితో ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్ సీన్స్ ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి.
మరోవైపు మార్టిన్ ఓటు తమకు పడేలా చేసుకునేందుకు లోకి, జగ్గు చేసే ప్రయత్నాలతో సెకెండాఫ్ మొదలవుతుంది. ఎప్పుడైతే మార్టిన్ ఓటు కీలకమని ఊరి ప్రజలకు అర్థమవుతుందో.. అక్కడ్నుంచి ఊరి వారంతా అతనితో వ్యవహరించే తీరులోనూ మార్పులు కనిపిస్తాయి. ఇలా పలు సన్నివేశాలన్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి. మార్టిన్‌ను ఆకర్షించేందుకు జగ్గు, లోకి పోటీ పడి అతనికి కానుకలు ఇవ్వడం.. అతను మాత్రం ఎవరికి ఓటు వేయాలో తెల్చుకోలేకపోతున్నాని చెబుతూ పబ్బం గడుపుతూ పోవడం అందరినీ నవ్విస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక మార్టిన్ ఓటు కోసం లోకి, జగ్గు వేలానికి దిగడం.. ఈ క్రమంలో అతని ఓటు కోసం కోటి రూపాయలు గుమ్మరించేందుకు ఇద్దరూ సిద్ధపడటం కాస్త అతిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో మార్టిన్ మిత్రుడు బాటా చుట్టూ అల్లుకున్న మెలో డ్రామా సహనానికి పరీక్షగా నిలుస్తుంది. ఓటు విలువ తెలుసుకొని మార్టిన్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకునే తీరు.. ఊరి అభివృద్ధి కోసం దాన్ని వినియోగించిన విధానం ఆకట్టుకుంటాయి. ఎండింగ్ సీన్ కాస్త అసంతృప్తిగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే :
Martin Luther King Movie Cast : సంపూర్ణేశ్ బాబుకు నటుడిగా ఇదొక సరికొత్త ప్రయత్నం. ఇప్పటి వరకు స్పూఫ్ కామెడీ సినిమాలతో అలరించిన ఆయన ఈ సినిమాలో తనలోని సరికొత్త కోణాన్ని చూపించారు. ఎమోషనల్ టచ్‌లో ఉన్న పాత్రతో అలరించారు. ఆద్యంతం ఓ సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నారు. మార్టిన్ పాత్రకు తగ్గట్లుగా చాలా సహజమైన నటనను కనబరిచారు. జగ్గు పాత్రకు నరేశ్ తనదైన నటనతో జీవం పోశారు. అలాగే లోకి పాత్రలో వెంకటేశ్ కూడా నరేశ్‌కు దీటైన నటనను కనబరిచారు. వసంత పాత్రలో శరణ్య కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు కూడా పరిధి మేరకు ఉంటాయి. దర్శకురాలు తనకందించిన స్క్రిప్ట్‌నకు నిజాయతీగా న్యాయం చేసే ప్రయత్నాన్ని చేశారు. ప్రథమార్ధం సరదాగా సాగిపోయినప్పటికీ.. ద్వితీయార్ధం అక్కడక్కడా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. స్మరణ్ నేపథ్య సంగీతం బాగుంది. కానీ, పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేదు. దీపక్ ఛాయాగ్రహణం బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా తన కెమెరాలో బంధించాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.