Mansoor Ali Khan Trisha Controversy :తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష, కుష్బూలపై ఆయన పరువు నష్టం కేసు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆ ముగ్గురు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ కేసు వేసినట్లు ఓ స్టేట్మెంట్ ద్వారా తెలిపారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి ఆయన రూ.1 కోటి డిమాండ్ చేశారు. సోమవారం (డిసెంబర్ 11)న మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది.
అసలు ఏం జరిగిందంటే :
నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, 'లియో'లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సీన్ ఉంటుందని అనుకున్నట్లు కామెంట్ చేశారు. ఆ సీన్ లేకపోవడం వల్ల తనకి బాధ కలిగిందన్నారు. ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అయ్యి త్రిష దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తుందంటూ తన కోపాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్రిషకు మద్దతుగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, సింగర్ చిన్మయి నిలిచారు. మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు.
అయితే ఈ విషయంపై స్పందించిన మన్సూర్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.