Mangalavaram Movie Trailer Event : 'ఆర్‌ఎక్స్ 100' మూవీ ఫేమ్ అజయ్ భూపతి.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'మంగళవారం'. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న అజయ్‌భూపతి, పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేత సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఇది ఏ జానర్ సినిమా? అసలు కథేంటి?
అజయ్ భూపతి: స్టోరీ ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఇదొక డార్క్ యాక్షన్ థ్రిల్లర్. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఈ సినిమా తీర్చిదిద్దాం. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ట్రైలర్‌లో చూపించలేదు. ఈ సినిమాతో ఓ సరికొత్త జానర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తాను. 'ఆర్‌ఎక్స్ 100' సినిమాను అందరూ రొమాంటిక్ అన్నారు కానీ.. సినిమా రిలీజ్ అయ్యాక ఎంతోమంది ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఈ చిత్రానికీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాను.
'ఆర్‌ఎక్స్ 100' సక్సెస్ మీకు ఎప్పుడైనా భారంగా అనిపించిందా?
అజయ్ భూపతి:దర్శకుడిని కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. హిట్ లేదా ఫ్లాప్ అనేది నాకు సంబంధం లేదు. 'మహా సముద్రం' సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ అయినా 'మంగళవారం' చిత్రాన్ని తీసేవాడిని. ఆ సినిమా సక్సెస్ భారంగా మారిందా? మళ్లీ అంత సక్సెస్ కొట్టగలమా? లేదా? అనేది నేను ఆలోచించలేదు. విభిన్న చిత్రాలు తీస్తూ ముందుకు వెళ్తాను. అదే నాకు తెలుసు.
'మహా సముద్రం' విషయంలో మీ జడ్జిమెంట్ తప్పిందంటారా?
అజయ్ భూపతి:సినిమా ఏదైనా సరే మంచి ఫలితం వస్తుందన్న నమ్మకంతోనే తీస్తాం. రేపు రిలీజ్ అనగా.. ఈ రోజు తాము తెరకెక్కించిన సినిమా చూసి అది హిట్టు అవుతుందా? లేదా ఫ్లాప్ అవుతుందా అనేది ఎవరూ ఊహించలేరు. ప్రేక్షకుల్లోకి వెళ్లాకే దాని ఫలితం తెలుస్తుంది.
ఈ సినిమా మీకు తిరిగి సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నారా?
పాయల్ రాజ్‌పుత్: ఇదొక అద్భుతమైన కథతో రూపొందిన సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అలాగే నాకు విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను.
సాధారణంగా సక్సెస్ అయిన సినిమా పేరుని మాత్రమే కొత్త సినిమా పోస్టర్‌పై వేస్తారు కదా. మీరేంటి ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ 'ఆర్ ఎక్స్ 100', 'మహాసముద్రం' అని వేశారు?