తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'పాఠం నేర్చుకున్నా.. మళ్లీ ఆ తప్పులు చేయను.. ఇక 'మా' ఎన్నికలకు దూరం'

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'జిన్నా'. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

manchu vishnu about his movie ginna and career
Etv manchu vishnu about his movie ginna and career

By

Published : Oct 20, 2022, 6:23 AM IST

Manchu Vishnu Ginna Movie: ''రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నా. మా అమ్మనీ, పిల్లలనీ తీసుకెళ్లి చూడగలిగేలా ఉండాలి. విపరీతంగా నవ్వుకోవాలి. ఈ రెండు లక్షణాలున్న కథలతోనే నా ప్రయాణం'' అంటున్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన 'జిన్నా' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంచు విష్ణుముచ్చటించారు. ఆ విషయాలివీ..

కామెడీ కథల్ని ఎంచుకున్నప్పుడంతా మీకు మంచి ఫలితాలే వచ్చాయి. 'జిన్నా' చేయడానికి కారణం అదేనా?
నాకు దక్కిన విజయాలన్నీ యాక్షన్‌ కామెడీ కథలతోనే. కానీ నేను అవి వదిలేసి వేరే తరహా కథలు చేశా. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే 'జిన్నా' చేశా. ఈ ప్రయాణంలో నేనొక పాఠం నేర్చుకున్నా. భవిష్యత్తులో మళ్లీ ఆ తప్పులు చేయను. కడుపుబ్బా నవ్వించే కథతో 'జిన్నా' తెరకెక్కింది.

'జిన్నా' పేరు పెట్టడానికి కారణం ఏమిటి?
'ఢీ' సినిమాకి మేం మొదట అనుకున్న పేరు ఇదే. ఇందులో నా పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. తనని జిన్నా అనే పిలవండని చెబుతుంటాడు. గాలి మాటలు చెప్పే నాగేశ్వరరావు అప్పు చేసి టెంట్‌ హౌస్‌ పెట్టుకుంటాడు. తన టెంట్‌ హౌస్‌ ఏ పెళ్లికి వెళ్లినా ఆ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి జరగదు, అప్పు తీరదు. ఈ లైన్‌ చెప్పగానే చాలా రోజుల తర్వాత ఓ మంచి కథ నా దగ్గరికి వచ్చిందనిపించింది. ఈ పేరు చుట్టూ వివాదాలు నడిచాయి. కానీ మా ఉద్దేశం వేరు కాబట్టి మేం పట్టించుకోలేదు. నేను మాట్లాడినా వివాదమే, మాట్లాడకపోయినా వివాదమే. అందుకే నా పని నేను చూసుకుంటున్నా.

ఈ సినిమా విషయంలో మీకెదురైన సవాళ్లు ఎలాంటివి? పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి వచ్చిందా?
చిత్తూరు యాస మాట్లాడటం కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యా. నాగేశ్వరరెడి అందించిన మూల కథతో కోన వెంకట్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారు. కోన నా దగ్గరికి రాకముందే సన్నీలియోన్‌ని కథానాయికగా అనుకుని వచ్చారు. తనే ఎందుకనేది సినిమా చూశాక అందరికీ అర్థమవుతుంది. శ్రీనువైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మీ అమ్మాయిలు పాట పాడారు. ఆ నిర్ణయం ఎవరిది?
నా కెరీర్‌ పరంగా సువర్ణాక్షరాలతో రాసుకోవల్సిన విషయం అరియానా, వివియానా పాట పాడటం. మా అమ్మాయిలు పాడతారని అనూప్‌కి నేనే చెప్పా. ఇది నలుగురు చిన్న పిల్లల కథ. చిన్నప్పుడు పాడుకునే ఓ పాట ఉంటుందని, అది పిల్లలతో పాడించాలని చెప్పారు అనూప్‌. మా అమ్మాయిలు సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అయినా వాళ్లు బాగా పాడకపోతే ఏం చేయాలి? ఎలా చెప్పాలని అనూప్‌ చివరిదాకా టెన్షన్‌ పడుతూనే ఉన్నాడట. ఆ విషయం పాట పూర్తయ్యాక చెప్పాడు. వాళ్లు పాడిన విధానం బాగుందని అందరూ మెచ్చుకున్నారు. వాళ్లిద్దరూ నటులు కావాలనేది నా కోరిక. అయితే ఆరియానా గాయని కావాలని ఫిక్స్‌ అయ్యింది. వివియానాకి పెయింటింగ్‌పై ఆసక్తి ఉంది. మా అబ్బాయి అవ్రామ్‌ అయితే మేం చెప్పకుండానే డాన్స్‌లేస్తున్నాడు. మా పిల్లలు నటనవైపు వస్తే నాకు చాలా ఆనందం. ఇది గొప్ప వృత్తి. పది మందికి ఆనందం పంచడానికి మించిన విషయం ఏముంటుంది? అయితే వాళ్లకేం కావాలో వాళ్లే నిర్ణయించుకుంటారు.

తదుపరి చేయనున్న సినిమా 'డీ అండ్‌ డీ'నేనా?
'ఢీ'కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా అది. జనవరిలో మొదలు పెడతాం. దీంతో పాటు పదిహేనేళ్లుగా నేను చేయాలనుకున్న దర్శకుడితో కలిసి రంగంలోకి దిగబోతున్నా. కామెడీతో కూడిన ఓ కొత్త జానర్‌తో ఆ సినిమా రూపొందబోతోంది. రీమేక్‌ కోసం ఆరేడు సినిమాలు కొని పెట్టుకున్నా. వేరే హీరోలతో ఆ సినిమాలు నిర్మిస్తా. ఆ ప్రాజెక్టులన్నీ నవంబర్‌ 22న ప్రకటిస్తా. అందులో ఒకటి 'ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌'. నాన్న కోసం కొన్న కథ అది.

నిర్మాత ఆదిశేషగిరిరావుతో మాట్లాడాకే నేను ఛాంబర్‌లో మా భవనం నిర్మాణం విషయాన్ని ప్రకటించా. ఛాంబర్‌ అయినా కొత్త నిర్మాణం పూర్తయ్యాక కార్పొరేట్లకి ఎవరికో ఒకరికి అమ్మాల్సిందే కదా. అందుకే మేం కొంత స్థలాన్ని తీసుకుంటామని అడిగాం. వాళ్లు అంగీకారం తెలిపారు. 'మా' కోసం నిధుల్ని సేకరించేందుకు కూడా కొన్ని కార్యక్రమాల్ని చేపట్టబోతున్నాం. 'మా' అనేది ఉమ్మడికుటుంబం. ఇక్కడ పెద్దలు చెప్పినట్టు నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నా బాధ్యతని నేను నిర్వర్తించా. పెద్దలు ఎవరు నిర్ణయిస్తే వాళ్లే తదుపరి మా అధ్యక్షుడు ఎన్నిక కావాలని కోరుకుంటా. ఎన్నికంటే మాత్రం ఇక నేను దూరమే.

ఇవీ చదవండి:చాలా కాలం తర్వాత మీడియాకు ముందుకు లైలా.. ఇప్పుడెలా ఉందో చూశారా?

పవన్​కల్యాణ్, కార్తిపై నాగార్జున కామెంట్స్​.. వారిద్దరూ అలాంటి వారంటూ..

ABOUT THE AUTHOR

...view details