మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. అనుకున్నట్టే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. కాబోయే భార్య ఫొటోను కూడా పోస్ట్ చేశారు. 'పెళ్లి కూతురిగా మౌనిక రెడ్డి' అంటూ రాసుకొచ్చారు. 'మంచు మనోజ్ వెడ్స్ మౌనిక' అని కూడా క్యాప్షన్ జోడించారు. నేడు(మార్చి 3) రాత్రి 8.30 గంటలకు వీరిద్దరు ఒక్కటి కానున్నారని తెలిసింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇళ్లు.. పెళ్లి వేదిక కానున్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా చక చకా జరుగుతున్నాయట. ఇరు కుటుంబసభ్యులతో పాటు అతి తక్కువ మంది సమక్షంలో ఈ వివాహం జరగనుంది.
ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీ వెడ్డింగ్ వేడుకలన్నీ ఘనంగా జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే చాలా కాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అలా మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే ఇప్పుడు మరో విషయం కూడా సోషల్‌మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి మంచు మనోజ్ గెస్ట్‌గా హాజరయ్యారట. అలాంటిది ఇప్పుడు ఆమెనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ దీని గురించి చాలా మంది తెగ మాట్లాడుకుంటున్నారు.