Malli Pelli Review : టాలీవుడ్లో నరేశ్ కథానాయకుడిగా చాలా సినిమాలే చేశారు. పవిత్ర లోకేశ్ కూడా కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. వీరిద్దరూ ప్రస్తుతం తెలుగులో సహాయ నటులుగా సెకండ్ ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరు ప్రధాన పాత్రధారులుగా కలిసి నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'. ఎం.ఎస్.రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది.
ఇదీ కథ.. హీరో నరేందర్ (నరేశ్), సౌమ్య సేతుపతి (వనిత విజయ్‌కుమార్) వివాహ బంధంతో ఒక్కటై ఓ బిడ్డకి జన్మనిస్తారు. వారి కాపురంలో కలహాలు మొదలై.. ప్రశాంతత కోరుకునే నరేందర్ జీవితంలోకి నటి పార్వతి (పవిత్ర లోకేశ్) ఎలా వచ్చింది? ఆమె కోసం నరేందర్ ఏం చేశాడనేది సినిమా అసలు కథ.
Malli Pelli Story : ప్రేక్షకులందరికీ తెలిసిన కథనే ఈ సినిమాలో చూపించారు. హీరో నరేశ్, హీరోయిన్ పవిత్రలు రియల్ లైఫ్ రోల్స్లాగానే ఇందులోనూ నటించారు. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రపంచం మొత్తానికి తెలుసు. సోషల్ మీడియాలో వీరిద్దరి వార్తలు హల్చల్ చేశాయి. అచ్చం అవే సంఘటనల్ని, వాటికి కారణాల్ని నరేశ్, పవిత్ర కోణంలో ప్రేక్షకులకు చూపే ప్రయత్నం చేశారు దర్శకుడు ఎం.ఎస్.రాజు.
ఒక రకంగా చెప్పాలంటే వారిద్దరి ప్రేమ కథకి సంబంధించిన బయోపిక్ ఇది. వారిద్దరూ ఎలా పరిచయం అయ్యారో.. వాళ్ల మధ్య బంధం ఎలా ఏర్పడిందో ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. ఆడియెన్స్‌కు తెలియని పవిత్రా లోకేశ్ వ్యక్తిగత జీవితాన్ని, రచయిత, నటుడైన పార్వతి భర్తతో ఆమె జీవితం ఎలా సాగిందో, అతడ్ని కాదని నరేందర్‌కు ఎందుకు దగ్గరైందో సెకండ్ హాఫ్‌లో చూపించారు.
నరేశ్, పవిత్ర లోకేశ్, వనిత విజయ్‌కుమార్‌ల చుట్టూనే సన్నివేశాలు సాగుతాయి. ఆ ముగ్గురూ వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. నరేశ్ తల్లి విజయనిర్మల పాత్రలో జయసుధ, సూపర్‌స్టార్ కృష్ణ పాత్రలో శరత్‌బాబు నటించారు. కాగా శరత్‌బాబు నటించిన ఆఖరి సినిమా ఇదే. జయసుధ, నరేశ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నటి అనన్య నాగళ్ల టీనేజ్ పార్వతిగా అందంతో ఆకట్టుకున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా యావరేజ్‌గా ఉందని పబ్లిక్ టాక్.
ప్రధాన పాత్రల్లో కనిపించిన నరేశ్, పవిత్ర నటన పరంగా అదరగొట్టారని పలువురు నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఎవరికీ తెలియని పవిత్ర ఫ్లాష్‌బ్యాక్, విరామ సన్నివేశాలు సినిమాకు పాజిటీవ్‌గా నిలిచాయి.