సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో తన తండ్రిని గుర్తుచేసుకుంటూ హీరో మహేశ్ బాబు ఓ ఎమోషనల్ లెటర్ రాశారు. దానిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. "మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. జీవితం చివరి వరకూ ధీశాలిగా, ధైర్యసాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. ధైర్యసాహసాలు మీ స్వభావం. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. అదేంటో, గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీరు అండగా ఎల్లప్పటికీ ఉంటారు. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీరు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటా. లవ్ యూ నాన్న." అని మహేశ్ బాబు భావోద్వేగం చెందారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత తొలిసారిగా మహేశ్ ఎమోషనల్ పోస్ట్
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంపై హీరో మహేశ్ బాబు ఓ భావోద్వేగ లేఖ రాశారు. దానిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, ఈ ఏడాది.. మహేశ్‌బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మహేశ్ మానసికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇక ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు నవంబరు 15న తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో అంతకముందు రోజే అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు. సూపర్‌స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది. అలా నవంబరు 15 తెల్లవారుఝామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం నవంబరు 16న ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు తారక్ బన్నీ రామ్‌చరణ్ ఇంకా ఎవరెవరు వచ్చారంటే