చిత్రసీమ అంటేనే వారసత్వానికి చిరునామా. ఒకరు స్టార్‌గా నిలదొక్కుకుంటే చాలు.. వారి ఇంటి నుంచి వారసులు చాలా మంది తెరపైకి వస్తుంటారు. చివరకు ప్రతిభ ఆధారంగా సినీ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. అయితే అలా వచ్చే వారిలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు గౌతమ్ ఒకడు. మహేశ్ నటించిన '1' సినిమాతో అరంగేట్రం చేశాడు. చిన్నారి మహేశ్‌గా మెప్పించాడు. అయితే ఆ తర్వాత తెరపై కనిపించలేదు. సోషల్‌మీడియాలోనూ తక్కువగానే కనిపిస్తుంటాడు. ఎక్కువగా మాట్లాడడు. చాలా సైలెంట్‌గా ఉంటాడు. కానీ మహేశ్ బాబు తనయుడిగా గౌతమ్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.
అయితే ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరో సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్ బాబు. ఇప్పుడు మహేశ్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని నటుడిగా రాణించేందుకు గౌతమ్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియోను మహేశ్ భార్య నమ్రత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'అతను ప్రేమలో నిపుణుడు కాదు.. కానీ అతనికి స్నేహితులు ఉన్నారు. అతడు హైస్కూల్‌లో తన మొదటి థియేటర్ ప్రొడక్షన్.. తనస్టైల్‌లో నటించేశాడు. తనకు ఫ్రోజెన్ ఫ్యామిలీ (అమెరికన్ ఫాంటసీ ఫిలిమ్స్) ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..' అంటూ అమెరికన్ ప్లే (నాటకం) వీడియోను షేర్ చేసింది నమ్రత శిరోద్కర్.
ఈ వీడియోలో గౌతమ్.. తన స్కూల్లో ఓ ఇంగ్లీష్ డ్రామాలో నటిస్తూ కనిపించాడు. డిఫరెంట్ గెటప్‌లో చక్కగా ఇంగ్లీష్ డైలాగ్‌లు చెబుతూ హావాభావాలు పలికిస్తూ కనిపించాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వీడియోను మీరు చూసేయండి..