సూపర్ స్టార్ మహేశ్‌బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు జక్కన్న. ఈ చిత్రం కోసం హాలీవుడ్ ఏజెన్సీ సీఏఏతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సీఏఏతో ఆయన ఒప్పందం చేసుకున్నారనే వార్తలు గతంలో కూడా వచ్చాయి. అసలు ఈ సీఏఏ అంటే ఏంటంటే?
సీఏఏ అంటే?.. సీఏఏ పూర్తి పేరు క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ. ప్రతిభను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. 1975 నుంచి లాస్‌ఏంజెల్స్ కేంద్రంగా ఈ ఏజెన్సీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రపంచంలోని ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, నటీనటులు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంటారు.
ఆయా విభాగాల్లో (24 క్రాఫ్ట్స్) నిపుణులైన వీరందరినీ.. ఈ ఏజెన్సీ ఆయా చిత్ర బృందాలకు సప్లై చేస్తుంటుంది. అంటే తామో సినిమా తెరకెక్కించదలచి కథ కోసం ఏ నిర్మాతైనా దర్శకుడైనా ఏజెన్సీని సంప్రదిస్తే అక్కడ రైటర్లు స్టోరీలను అందిస్తుంటారు. అలాగే నటులు, టెక్నిషియన్లను సప్లై చేస్తారు. ఇకపోతే ఈ ఏజెన్సీ.. వెండితెరతో పాటు బుల్లితెరకు సంబంధించి బ్రాండింగ్, మార్కెటింగ్ కూడా చేస్తుంది. కొన్నాళ్ల క్రితం క్రీడా రంగంలోనూ అడుగుపెట్టింది.