దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందారు. తన సినీ జర్నీలో ఎన్నో హిట్ సినిమాలకు ప్రాణం పోసిన ఈ స్టార్ డైరెక్టర్.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాకు ఆస్కార్ వరించడంతో ఆయన పేరు మరింత మారుమోగిపోయింది. దీంతో అభిమానులు సైతం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండనుందో అంటూ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ సినిమాల తరహాలో ఈ కథ ఉండనుందని కూడా వెల్లడించారు.
ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక ఊహాగానాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న వేళ ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ రామాయణంలోని హనుమంతుడి పాత్రను పోలి ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాలపై మహేశ్ బాబు పోరాడనున్నారట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగనున్న ఈ సినిమా.. 2023 చివరి కల్లా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో మొదలు కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం జక్కన్న.. హాలీవుడ్ నుంచి భారీ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపనున్నారట.