Guntur Kaaram Review :సంక్రాంతి పండుగ - అందులోనూ స్టార్ హీరో - స్టార్ డైరెక్టర్ కాంబోలో సినిమా అంటే ఆ హంగామా వేరేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే. 'గుంటూరు కారం' విషయంలోనూ అదే జరిగింది. చాలా కాలం తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేసిన చిత్రమిది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రమణగా మహేశ్ మాస్ అవతార్ మెప్పించిందా? తెలుసుకుందాం
Guntur Kaaram Story : కథేంటంటే : రాయల్ సత్యం (జయరామ్), వైరా వసుంధర (రమ్యకృష్ణ) కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్‌బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. అయితే వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణకు న్యాయ శాఖ మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్‌రాజ్) రాజకీయ చక్రాన్ని తిప్పుతుంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావిస్తాడు. అందుకే వెంకటస్వామి - రమణతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకును ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. మరి తల్లిని ఎంతో ప్రేమించే రమణ, ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా? ఇంతకీ ఆ అగ్రీమెంట్‌లో ఏముంది? అసలు తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలి పెట్టాల్సి వచ్చింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే : త్రివిక్రమ్ మేజిక్(Guntur Kaaram Trivikram) ఏ దశలోనూ కనపడలేదు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. తెలిసిన కథల్నే కొత్తగా చెప్పడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ ఈసారి నిరాశపరిచారు. సంతకం చేస్తే తల్లి కొడుకుల బంధం తెగిపోతుందని తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన దర్శకుడు, ఆ తర్వాత సినిమాని కాలక్షేప సన్నివేశాలతో నడిపించేశాడు. చాలా పాత్రలకు, సన్నివేశాలకు కథతో అస్సలు సంబంధం ఉండదు. తల్లి - కొడుకు పాత్రల మధ్య ఉండాల్సిన సంఘర్షణపైన దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు.
ఫస్ట్ ఆఫ్ విషయానికొస్తే హీరో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు, శ్రీలీల, వెన్నెల కిశోర్‌తో కలిసి హీరో చేసే హీరో చేసే హంగామా తప్ప మరేదీ కనపడదు. హీరోతో సంతకం కోసం మురళీశర్మ తన కూతురుని రంగంలోకి దించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.