Mahadev Betting App Case : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లకు ఈడీ గురువారం సమన్లు జారీచేసింది. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు సమన్లు జారీ చేసిన మరుసటి రోజే వీరికి సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి కమెడియన్ కపిల్ శర్మతో పాటు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్‌లను వేర్వేరు తేదీల్లో ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు అక్టోబర్ 4న సమన్లు జారీ చేసింది ఈడీ. ఇందులో అక్టోబర్ 6న రాయ్‌పుర్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు. అయితే అందుకు రణ్‌బీర్ రెండు వారాల సమయం కోరినట్లు సమాచారం.
కాగా.. బెట్టింగ్ యాప్ మాటున జరుగుతున్న భారీ స్కామ్‌ను ఈడీ ఇటీవల బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్ చంద్రఖర్, రవి ఉప్పల్ యూఏఈలోని దుబాయ్ కేంద్రంగా దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే, వీరు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్ యాప్ పెద్ద ఎత్తున యాడ్స్ కోసం ఖర్చు చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల కోల్‌కతా, భోపాల్, ముంబయి సహా ఇతర ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించి.. మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.