సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ మృతిని మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు సినీ సెలబ్రిటీల మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సీనియర్ నటుడు గుఫి పైంటాల్, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ, బాలీవుడ్ సీనియర్ నటి సులోచన లట్కర్ మరణ వార్తతో సీని ప్రపంచం శోక సంద్రంలోకి మునిగిపోయింది.
ఆన్‌స్క్రీన్ శకుని మామ ఇక లేరు!
Gufi Paintal Death : బాలీవుడ్ సీనియర్ నటుడు గుఫీ పైంటాల్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపతున్న ఆయన ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
90స్లో పాపులరైన మహాభారత్ సీరియల్‌లో శకుని మామ పాత్రలో నటించిన ఆయన.. ఆ రోల్‌తో ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఇక గుఫీ టీవీ షోలతో.. పలు సినిమాల్లోనూ నటించారు. 1975లో విడుదలైన రఫూ చక్కర్ అనే సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఆయన... 'ఓం నమః శివాయ', 'కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ',' రాధాకృష్ణ', 'జే కనియా లాల్', 'కానూన్', 'బహదూర్ షా జఫర్', 'సీఐడీ', షోలలోనూ కనిపించారు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ లాంటి సినిమాల్లోనూ గుఫి కనిపించారు.
సీనియర్ నటి సులోచన లట్కర్ కన్నుమూత!
Sulochana Latkar Death : బాలీవుడ్ సీనియర్ నటి సులోచన లట్కర్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యల వల్ల ముంబయి దాదర్‌లోని సుశ్రుసా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1928 జూలై 30న కర్ణాటకలోని ఖడక్లాత్‌లో జన్మించిన ఆమె..1946లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1959లో రిలీజైన 'దిల్ దేకే దేఖో' అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. 1995 వరకు అనేక సినిమాల్లో నటించారు. 'సంపూర్ణ రామాయణం', 'జీవచా శాఖ', 'గోరా ఔర్ కాలా', లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఆమె.. దాదాపు 250కి పైగా మరాఠీ చిత్రాల్లో కనిపించారు.
రోడ్డు ప్రమాదంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మృతి
Kollam Sudhi Accident : ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ మరణించారు. 39 ఏళ్ల సుధీ.. కేరళలో ఉదయం సుమారు 4.30 గంటల ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. ఇంకా ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మిగతా ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్.. సమీపంలోని కొడుంగలూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సుధీ మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కాగా, సుధీతో పాటు మరో ముగ్గురు వటకరా ప్రాంతంలో ఓ ఈవెంట్‌ను ముగించుకుని కారులో తిరుగు ప్రయాణాన్ని మొదలెట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీ తలకు బలమైన గాయమైంది. దీంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.