Maa Oori Polimera 2 Review : చిత్రం: 'మా ఊరి పొలిమేర 2'; నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు.. రచన, దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్, సినిమాటోగ్రఫీ : కుషేందర్ రమేష్‌రెడ్డి, సంగీతం: గ్యానీ; నిర్మాత: గౌర్ కృష్ణ; విడుదల: 03-11-2023.
ఈ వారం ప్రేక్షకుల థియేటర్లలో రిలీజైన సినిమాల్లో 'మా ఊరి పొలిమేర-2' ఒకటి. ముందునుంచే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ.. భారీ అంచనాల నడుమ నవంబర్ 3 శుక్రవారం విడుదలైంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. 'మా ఊరి పొలిమేర'కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటంటే : జంగయ్య (బాలాదిత్య) తన అన్న కొమిరి అలియాస్ కొమురయ్య (సత్యం రాజేష్).. కవిత (రమ్య)ను చేతబడి చేసి చంపాడని నిజం తెలుసుకున్నట్లు 'పొలిమేర' తొలి భాగంలో చూపించారు. ఇక చనిపోయారనుకున్న కవిత, కొమిరి ప్రాణాలతోనే ఉన్నట్లు.. వాళ్లు కేరళలో జీవిస్తున్నట్లు క్లైమాక్స్‌లో చూపించి ఆసక్తిరేకెత్తించారు. దీంతో ఈ సినిమా కథ అక్కడి నుంచే మొదలవుతుంది. రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి).. జాస్తిపల్లి పోలీస్‌స్టేషన్‌కు నూతన ఎస్సైగా వస్తాడు. ఇక రాకేందు మౌళి.. కొమిరి కేసుపై విచారణ తిరిగి ప్రారంభిస్తాడు. తన అన్నను చేతబడి నెపంతో హత్య చేశారని ఫిర్యాదు చేసిన జంగయ్యా.. చివరకు కేసు ఎందుకు వాపసు తీసుకున్నాడు ? ఆ తర్వాత నుంచి తనెందుకు కనిపించకుండా పోయాడు? అనే దానిపై విచారణ ప్రారంభిస్తాడు.
ఈ క్రమంలోనే కొమిరి చేసే క్షుద్రపూజలకు.. జాస్తిపల్లి ఊర్లోని ఏకపాదమూర్తి గుడికి, కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి ఓ లింక్ ఉందని కనిపెడతాడు. అలాగే కొమిరి తన స్నేహితుడు బలిజ (గెటప్ శ్రీను) భార్యను కేరళ తీసుకెళ్లినట్లు గుర్తిస్తాడు. అయితే కొమిరి క్షుద్రపూజలకు.. జాస్తిపల్లి గుడికి, అనంత పద్మనాభ స్వామి ఆలయానికీ ఉన్న సంబంధం ఏంటి? కొమిరి చేతబడులతో మనుషుల్ని చంపుతున్నాడని తెలుసుకున్న అతడి భార్య లక్ష్మి (కామాక్షి భాస్కర్ల) ఏం చేసింది? తన అన్నను వెతికి పట్టుకునేందుకు వెళ్లిన జంగయ్య ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకు సినిమా చూసి సమాధానం తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే :'మా ఊరి పొలిమేర' చివర్లో ట్విస్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే సీక్వెల్‌ను అంతకుమించిన ట్విస్టులతో తెరకెక్కించినట్లు దర్శకుడు అనిల్.. ప్రమోషన్స్‌లో పలుమార్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే 'మా ఊరి పొలిమేర-2' చిత్రాన్ని రూపొందించారు. కానీ, ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలన్న ప్రయత్నంలో డైరెక్టర్ .. అసలు కథను అతుకుల బొంతలా మార్చేసుకున్నట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు గందరగోళంగా ఉంటాయి. ప్రతిసారీ కథను గతంలోకి.. వర్తమానంలోకి తీసుకెళ్తూ కన్ఫ్యూజ్ చేశారు. ఇక పొలిమేర 1 లాగే ఈ సినిమాను కూడా ఆసక్తిరేపుతూ ముగించారు. అలాగే చివర్లో పలు ప్రశ్నలు 'పొలిమేర -3' కు పునాదిగా అనిపిస్తుంది.