Lokesh Kanagaraj Injured :నాలుగు భాషల్లో విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను అందుకున్న 'లియో' సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేరళ పాలక్కడ్ జిల్లాలోని ఓ థియేటర్‌కు మంగళవారం వెళ్లిన ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని ఆరోమా థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు లోకేశ్ కనగరాజ్ వెళ్లారు. దీంతో డైరెక్టర్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఆ సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనగరాజ్ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్..
మరోవైపు లోకేశ్‌ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ను నిలువరించే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వస్తున్నారని తెలిసి కేరళలోని సినిమా డిస్ట్రిబ్యూటర్లు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ అభిమానులు అవేవీ పట్టించుకోకుండా లోకేశ్‌ను చూసేందుకు ఎగబడ్డారు.
ప్రెస్ మీట్ వాయిదా..
అయితే పాలక్కడ్‌తో పాటు కొచ్చి, త్రిస్సూర్ జిల్లాల్లోని థియేటర్లకు కూడా మూవీ ప్రమోషన్స్ కోసం లోకేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే గాయం కారణంగా వాటిని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కొచ్చిలో జరగాల్సిన ప్రెస్ మీట్‌ను కూడా వాయిదా వేశారు. వాటికి సంబంధించిన వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అభిమానులతో దిగిన ఓ ఫొటోను కూడా యాడ్ చేశారు.