Lokesh Kanagaraj And Vijay Sethupathi: గతేడాది విడుదలైన 'విక్రమ్' సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిన విషయమే. లోకేశ్ టేకింగ్, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ప్రతీ ప్రేక్షకుడు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించింది. వందల కోట్లను కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్‌గా కమల్ హాసన్ పాత్రకు ఎంతటి విశేష ఆదరణ దక్కిందో.. సంతానంగా విజయ్ సేతుపతి పాత్ర కూడా అంతే ఆకట్టుకుంది. అయితే తాజాగా ఎల్సీయూలో భాగంగా తర్వాత రాబోయే చిత్రాల్లో విజయ్ సేతుపతి సంతానం పాత్ర కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చారు లోకేశ్ కనగరాజ్.
'విక్రమ్' చిత్రంలో విజయ్ సేతుపతి చేసిన సంతానం పాత్ర.. పూర్తి నెగిటివ్‌గా, వైలెన్స్‌తో ఉంటుంది. లోకల్‌గా డ్రగ్స్ మాఫియాను శాసించే వ్యక్తిగా ఆయన కనిపించారు. అయితే అసలీ పాత్రను మొదట రాఘవ లారెన్స్ పోషించాల్సింది. కానీ ఆ తర్వాత సంతానం పాత్ర విజయ్ సేతుపతి దగ్గరికి వెళ్లడం, అది ఆయన నటించడం, ప్రేక్షకులకు తెగ నచ్చేయడం జరిగింది.
విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చాలా చిత్రాల్లో కనిపించారు కానీ.. ఈ చిత్రంలోని సంతానం విలన్ పాత్ర వేరే లెవెల్ అనే చెప్పాలి. అంతలా భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఎక్కడా చూసిన ఈ పాత్ర రీల్సే కనిపించాయి. నెగెటివ్ రోలే అయినప్పటికీ.. ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సంతానంగా విజయ్ నటించారు అని అనడం కన్నా జీవించారనే చెప్పాలి. అయితే ఈ విక్రమ్ చిత్రం చివర్లో సంతానం పాత్ర కథ ముగుస్తుంది. విక్రమ్ చంపేసినట్టుగా చూపిస్తారు. కానీ దాన్ని క్లారిటీగా చూపించరు.