''లైగర్'తో నేను ఇండియాను షేక్ చేస్తానని చెప్పా. కానీ, అదొక తప్పు స్టేట్‌మెంట్. మనందరం (ప్రేక్షకులు) ఇండియాను షేక్ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్ సినిమాను దింపుతున్నాం'' అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌మార్షల్ ఆర్ట్స్ మూవీ 'లైగర్'. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హీరో విజయ్, దర్శకుడు పూరిని ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..
'లైగర్' ట్రైలర్ చూస్తే, కథ ఏంటో అర్థం కావటం లేదు. మీ సినిమా నుంచి ఇంకో ట్రైలర్ వస్తుందా?
పూరి జగన్నాథ్: 'లైగర్' ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాం. ఇది ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ. ఆ మూమెంట్లే ట్రైలర్‌లో కట్ చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఎక్కువ డైలాగ్‌లు ఆశించారు. ఇందులో హీరో పాత్రకు నత్తి. అలాంటి సందర్భంలో ఎక్కువ డైలాగ్‌లు పెడితే బాగుండదు. నేను ప్రయత్నించా. కానీ, అంత ఆసక్తిగా లేదు. కథ తెలియకపోయినా, ట్రైలర్ చూస్తే కథ అర్థమైపోతుంది. తల్లీ-కొడుకులు టీ అమ్ముకుంటూ, రిక్షా తొక్కుతూ బతుకుతారు. ఒక కరీంనగర్ కుర్రాడు, వాళ్ల అమ్మ కలిసి ముంబయి వెళ్లి ఏం చేశారు? తన కొడుకును ఛాంపియన్‌గా చూడటానికి ఆమె ఏం చేసింది? తల్లి కల కోసం ఆ యువకుడు ఎంత కష్టపడ్డాడు? ఏం రేంజ్‌కు వెళ్లాడు? అన్నది సినిమాలో చూడొచ్చు..!
సినిమాలో మైక్‌టైసన్ ఉంటే చాలా క్రూరంగా ఉంటారని అనుకుంటాం. కానీ, ట్రైలర్‌లో చాలా సరదాగా చూపించారు? ఆయన పాత్ర ద్వారా ఏం ఆశించవచ్చు?
పూరి జగన్నాథ్: ట్రైలర్‌లో ఏం చూపించామో దాన్ని నమ్మి సినిమాకు రండి. ఏవేవో అంచనాలు మాత్రం పెట్టుకోవద్దు. టైసన్‌కు మాత్రం కొత్త లుక్‌మాత్రం ఇచ్చాం. క్లైమాక్స్‌లో వచ్చే సిట్యువేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రాలేదు. ఈ మధ్య వచ్చిన 'పుష్ప' క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో-విలన్ కూర్చొని మాట్లాడుకోవడం కొత్తగా ఉంది. ఇందులోనూ హీరోకు, మైక్ టైసన్‌కు వచ్చే సిట్యువేషన్ కొత్తగా ఉంటుంది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ: ప్రేక్షకులకు ప్రతి సినిమాపై కొన్ని అంచనాలు ఉంటాయి. థియేటర్‌లో ఆ అనుభూతిని మనం చెడగొట్టలేం. అందుకే సినిమాను అక్కడ చూడాలి. కథ చెప్పటం ట్రైలర్ పని కాదు. సినిమా చూడాలన్న ఆసక్తి మీలో రేకెత్తిస్తే, ట్రైలర్ పని పూర్తయినట్లే. ట్రైలర్‌లన్నీ ఒక ఫార్మాట్‌లో నడుస్తున్నాయి. దాన్ని 'లైగర్' బ్రేక్ చేసింది.
మీ హీరోలకు ఒక ప్రత్యేక యాటిట్యూడ్ పెడతారు. 'లైగర్' హీరో కూడా షార్ట్‌తో ప్రత్యేకంగా ఉన్నాడు.. అది ఎలా సాధ్యమైంది?
పూరి జగన్నాథ్: కథ చెప్పిన తర్వాత తనే క్యారెక్టర్ కోసం వర్కవుట్ చేశాడు. జుట్టు పెంచాడు. హీరోలెవరూ లోయర్ చూపించరు. కానీ, అలా చూపించటానికి విజయ్‌కు గట్స్ ఉన్నాయి. ఆ క్రెడిట్ అంతా తనదే. నా ఫ్రెండ్ ఇదే వీడియో చూసి, 'ఏంటన్నా.. విజయ్ ఆ గట్స్.. లోయర్ చూపించాడు' అన్నాడు. 'మావాడు సినిమా కోసం చడ్డీ తీసేయమన్నా తీసేస్తాడు' అన్నాను.
విజయ్ ఏదైనా చేస్తాడని మీకు అనిపిస్తోందా?
పూరి జగన్నాథ్: కచ్చితంగా ఏదైనా చేస్తాడు. ఈ ఏజ్‌లో ఇలాంటివి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తా?అని విజయ్ నాతో అన్నాడు.