Leo Movie Tickets Sales Record :అటు కోలీవుడ్‌తో పాటు ఇతర సౌత్ ఇండస్ట్రీల్లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో తమిళ స్టార్ నటుడు విజయ ఒకరు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'లియో'. అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఓ రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఓవర్సీస్లో బుకింగ్స్ ఓపెన్ కాగా.. 40వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలిసింది. అయితే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఇన్ని వేల సంఖ్యలో టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్వీట్టర్లో తెలిపింది. థియేటర్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
అప్పటివరకు 50వేలకు పెరగొచ్చు..
అయితే ఇంత వరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదని యూకేకు చెందిన నిర్మాణ సంస్థ ప్రకటించింది. మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే ఇంత భారీ మొత్తంలో టికెట్లు సేల్ అవ్వడం ఓ రికార్డని పేర్కొంది. విడుదల ముందు నాటికి ఈ సంఖ్య 50వేలకు చేరవచ్చని నిర్మాణ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
మొదట్నుంచి వార్తల్లో 'లియో'..
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అయితే దీని ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను కూడా చిత్రయూనిట్ రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని విజయ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. దీనికి తోడు సినిమాలోని అందరి ఫస్ట్‌లుక్ పోస్టర్లను గురువారం విడుదల చేసింది లియో టీమ్. ప్రస్తుతం ఇవి కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన 'నా రెడీ' పాట ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.