Leo MovieTelugu Review :చిత్రం: లియో; నటీనటులు: విజయ్, త్రిష, అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, బాబూ ఆంటోనీ, సంజయ్ దత్, మనోబాల, జార్జ్ మరియన్, అభిరామ్ వెంకటాచలం తదితరులు; సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస; సంగీతం: అనిరుధ్ రవిచందర్; ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్; బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియో; నిర్మాత: ఎస్.ఎస్.లలిత్ కుమార్, జగదీష్ పళణిస్వామి; రచన: లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైదీ; దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్; విడుదల: 19-10-2023
'ఖైదీ', 'విక్రమ్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్- విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో'. అక్టోబర్ 19న థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది? ఆ విశేషాలు మీ కోసం..
స్టోరీ ఏంటంటే : పార్తి అలియాస్ పార్తిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లోని థియోగ్‌లో స్థిరపడిన ఓ తెలుగువాడు. 20ఏళ్లుగా ఓ కేఫ్ నడుపుకొంటూ అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య సత్య (త్రిష). వీరిది ప్రేమ వివాహం. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు.. పాప జన్మిస్తారు. అయితే హాయిగా.. సంతోషంగా సాగిపోతున్న పార్తి జీవితం.. ఓ క్రిమినల్ ముఠా వల్ల తలకిందులవుతుంది. ఓ రాత్రి తన కేఫ్‌లోకి వచ్చి డబ్బులు దోచుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ ముఠాను పార్తి అక్కడిక్కడే కాల్చి చంపేస్తాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. అయితే తను ఆత్మరక్షణ కోసమే వాళ్లను చంపినట్లు కోర్టులో తేలడం వల్ల నిర్దోషిగా విడుదలవుతాడు. కానీ, ఓ వార్తా పత్రికలో అతని ఫొటో చూసిన ఆంటోని దాస్ (సంజయ్ దత్) గ్యాంగ్ పార్తిని వెతికి పట్టుకొని.. చంపేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు బయలుదేరుతుంది. దీనికి కారణం 20ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆంటోని కొడుకు లియో లాగా ఈ పార్తిబన్ ఉండటమే. మరి ఈ లియో ఎవరు? అతను.. పార్తిబన్ ఒక్కడేనా? లేక ఇద్దరా? సొంత కొడుకునే చంపాలని ఇటు లియో తండ్రి ఆంటోని, అతని అన్న హెరాల్డ్ దాస్ (అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తుంటారు? వీళ్లకు లియోకూ ఉన్న వైరం ఏంటి? పార్తి గతమేంటి? ఆంటోని గ్యాంగ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: ఇది లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రమైనప్పటికీ.. 'ఖైదీ', 'విక్రమ్' కథలతో దీనికి పెద్దగా లింక్ ఉండదు. వాటికి పూర్తి భిన్నంగా ఈ స్టోరీ సాగుతుంది. 'ఖైదీ'లో ఉన్న నెపోలియన్ పాత్రను దీంట్లో చూపించడం.. ఆంటోని దాస్ టీమ్ చేసే పొగాకు వ్యాపారం.. ఆఖరిలో విక్రమ్‌గా కమల్‌హాసన్ లియోతో ఫోన్లో మాట్లాడటం వంటి కొన్ని అంశాలే ఇది లోకేష్ యూనివర్స్‌లో భాగం అనిపించేలా కనిపిస్తాయి. అంతే తప్ప మిగతా కథనంలో ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. ఓ క్రిమినల్ ముఠా ఒక కలెక్టర్‌ను హత్య చేసి తప్పించుకునే ఎపిసోడ్‌తో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించారు లోకేశ్. ఆ వెంటనే హైనాతో తలపడే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పార్తిబన్ పాత్రలో విజయ్‌ను పరిచయం చేశారు. ఈ ఎపిసోడ్ ప్రథమార్ధానికి ఆకర్షణగా నిలుస్తుంది. అయితే అక్కడి నుంచి పార్తి కుటుంబాన్ని.. భార్యాపిల్లలతో అతని అనుబంధాన్ని చూపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. దీంతో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.
ఇక పార్తి కేఫ్‌లోకి క్రిమినల్ ముఠా ప్రవేశించడం.. వారితో అతను తలపడటం.. కూతుర్ని కాపాడుకునే క్రమంలో వాళ్లందర్నీ కాల్చి చంపడం.. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. లియోని వెతుక్కుంటూ ఆంటోని దాస్ గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చినప్పటి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆంటోని దాస్ పాత్రలో సంజయ్ దత్‌ను, హెరాల్డ్ దాస్ పాత్రలో అర్జున్‌ను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తొలిసారి పార్తీ, ఆంటోని ఎదురుపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విరామానికి ముందొచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి. ముఖ్యంగా ఆంటోనికీ.. పార్తికీ మధ్య వచ్చే ఛేజింగ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. పార్తిబన్, లియో ఒక్కరా.. ఇద్దరా? అనే పాయింట్ చుట్టూ సెకెండాఫ్ సాగుతుంది. లియో పాత్ర గతం.. తండ్రీ, అన్నతో వైరం ఏర్పడటానికి కారణం.. ఇటువంటి అంశాలు అంత ఆసక్తికరంగా అనిపించదు. అయితే వీళ్ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మెప్పిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో తన భార్యాబిడ్డల్ని చంపడానికి వచ్చిన ఆంటోని గ్యాంగ్‌ను పార్తి తన ట్రాప్‌తో చంపే తీరు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో హెరాల్డ్ దాస్‌కూ పార్తికీ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. 'విక్రమ్', 'ఖైదీ' చిత్రాల క్లైమాక్స్‌లో ఉన్నంత మెరుపు ఈ చిత్ర ముగింపులో కనిపించదు.
ఎవరెలా చేశారంటే: విజయ్ ఇందులో అటు పార్తిబన్గా ఇటు లియోగా రెండు కోణాలున్న పాత్రల్లో కనిపించారు. ఈ రెండింటికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన చక్కగా చూపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా పార్తి పాత్రలో విజయ్ కనిపించిన తీరు.. ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక లియోగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో చక్కటి హీరోయిజాన్ని చూపించారు. తల్లి పాత్రలో త్రిష చక్కగా ఒదిగిపోయింది. కథలో ఆమెకున్న ప్రాధాన్యత తక్కువే అయినా కనిపించిన ప్రతి సీన్‌లో తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. విజయ్‌తో ఆమె కెమిస్ర్టీ బాగుంది. హెరాల్డ్ దాస్‌గా అర్జున్, ఆంటోని దాస్‌గా సంజయ్ దత్ శక్తిమంతమైన పాత్రల్లో కనిపించారు. వాళ్ల పాత్రల్ని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఆ పాత్రల్ని ముగించిన తీరు ఏమాత్రం సంతృప్తికరంగా అనిపించదు. ప్రియా ఆనంద్ గౌతమ్ మేనన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరుల పాత్రలు పరిధి మేరకే ఉన్నాయి.