దివంగత దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో కుమారులిద్దరూ తల్లి జయలక్ష్మికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు ఫిల్మ్ నగర్లోని నివాసానికి పలువురు బంధువులు, కుటుంబసన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై జయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. విశ్వానాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే ఆయన భార్య జయలక్ష్మి చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఆదివారం సాయంత్రం విశ్వనాథ్ సతీమణి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినారు. అయితే దర్శకుడు విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించిన విషయం తెలిసిందే. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి మరణించడంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.