Lal Singh Chadda Oscar Academy: ఆమిర్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చడ్డా' పైనే గత కొంతకాలంగా బాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం(ఆగస్టు11) దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రారంభ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంపై సినీ పండితులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే 'బాయ్‌కట్ లాల్ సింగ్‌చడ్డా' ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను ఆస్కార్ అకాడమీ గుర్తించింది. ట్విట్టర్ ద్వారా మద్దతు తెలిపింది.
ఆస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' మ్యాజిక్‌ను హిందీలో ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్‌ను ఆస్కార్ అకాడమీ షేర్ చేసింది. 1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' చిత్రం 13 ఆస్కార్‌లకు నామినేట్ అయిందని కూడా వివరించింది. 'రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చింది. అయితే ఆస్కార్ అకాడమీ గుర్తింపుపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్ సినిమా కోసం అకాడమీ పీఐర్ ఏజెన్సీలా పనిచేస్తుందంటూ మండిపడుతున్నారు.
కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్..
'లాల్ సింగ్ చడ్డా' చిత్ర కథానాయిక కరీనాకపూర్.. 'బాయ్‌కట్ లాల్ సింగ్‌చడ్డా' ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ''లాల్ సింగ్ చడ్డా' ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో లేవు.. దీనిపై మీ స్పందనేంటి?' అన్న ప్రశ్నకు కరీనా సమాధానమిచ్చారు.