Kushi Movie Success Meet : రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన లేటెస్ట్ మూవీ 'ఖుషి' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఈ స్టార్.. ఈ సినిమా ద్వారా తాను సంపాదించిన మొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన 'ఖుషి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఆయన్ను కొనియాడుతున్నారు. ఇక ఈ సక్సెస్ మీట్లో హీరో విజయ్‌తో పాటు దర్శకుడు శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.
"నా మీద, మా సినిమాపైన సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయి. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. ఎన్నో ఫేక్ రేటింగ్స్, యూట్యూబ్ ఫేక్ రివ్యూలను దాటుకుని మరీ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందంటే దానికి కారణం మీ (అభిమానులు) ప్రేమే. మీరు ఇచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనిపించడంలేదు. ఆ సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమా విషయంలో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక నెరవేరింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి, సమాజంలో గౌరవం కావాలి.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటాను. కానీ, ఇప్పటి నుంచి మీకోసం పనిచేయాలనుకుంటున్నాను. మీరూ ఆనందంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలిసి 'ఖుషి'ని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. కానీ అది వీలుపడదు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) వారికి పది రోజుల్లో అందిస్తాను. మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్. నేను అనుకున్న ఈ పని పూర్తయినప్పుడు 'ఖుషి' విషయంలో తృప్తిగా ఉంటాను. వివరాలు కోసం సంబంధిత ఫామ్స్‌ని సోషల్ మీడియాలో మంగళవారం పోస్ట్ చేస్తాం" అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.
Kushi Movie Cast : ఇక 'ఖుషి' సినిమా విషయానికి వస్తే.. 'మజిలీ' ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీస్ పతాకం పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించగా.. మురళి జి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చెపట్టారు. ఇక ప్రవీణ్ పూడి ఈ సినిమాకు ఎడిటింగ్ చేశారు.