"ఒకప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ, ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం హైదరాబాద్ రావడం.. తొలి సినిమా 'ఉప్పెన'లో అవకాశం దొరకడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. కెరీర్ ఆరంభంలోనే వరుసగా మంచి పాత్రలు దక్కుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. మరింత కష్టపడి.. మరిన్ని మంచి పాత్రలు, సినిమాలు చేయాలని కోరుకుంటున్నా" అంది నటి కృతి శెట్టి. ఈ ఏడాది ఇప్పటికే 'బంగార్రాజు’, 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలతో సందడి చేసిన కృతి.. ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుధీర్‌బాబు హీరోగా నటించిన చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతిశెట్టి.
"ఈ విజయం నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో నేను నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర చేశా. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేసి 'నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుంది' అని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఓ నటిగా ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది. సినిమా చూసి మా అమ్మ చాలా ఎమోషనల్ అయ్యింది. నాన్నకి కూడా చాలా నచ్చింది. నేనీ చిత్రం చేయడం వారికి చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి పాత్రని నాకిచ్చినందుకు దర్శకుడు ఇంద్రగంటికి కృతజ్ఞతలు".
నా జీవితంలో జరిగిందనుకుంటా!
"నేను వైవిధ్యభరితమైన పాత్రలు పోషించగలిగినప్పుడే ప్రేక్షకులు నటిగా నాలోని ప్రతిభను గుర్తించగలుగుతారు. అప్పుడే నన్ను నమ్మి.. నా పాత్రలతో ప్రేమలో పడతారని విశ్వసిస్తా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఇలా వేటికవే విభిన్నంగా ఉన్నవే. కెరీర్ ఆరంభంలోనే ఇలా భిన్న కోణాలున్న పాత్రలు పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఏ సినిమా చేసినా.. అందులోని నా పాత్ర గురించి ముందే ఓ నోట్స్ సిద్ధం చేసి పెట్టుకుంటాను. దాని వల్ల ఆ పాత్రని అభినయించడం నాకు చాలా సులువుగా అనిపిస్తుంది. అలాగే సెట్‌లో ఓ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతోందనుకొని చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా సహజమైన హవభావాలు పలుకుతాయని నమ్ముతాను".