టాలీవుడ్లో 50 ఏళ్లకుపైగా హీరోగా, విలన్‌గా అటు దిగ్గజ నటులతో ఇటు యువ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ నటుడు కృష్ణంరాజు నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు మిగతా నటులతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన మాటలను ఓ సారి గుర్తుచేసుకుందాం..
ఎన్టీఆర్‌ను అలా చూడటం చాలా ఇష్టమట.. ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే కృష్ణంరాజుకు ఎంతోఇష్టమట. కృష్ణంరాజు తొలిసారి ఎన్టీఆర్‌ను కృష్ణుని గెటప్‌లోనే కలుసుకున్నారట. 'శ్రీకృష్ణతులాభారం' చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణును వేషంలో ఉండగా ఆయనను తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనపై చూపిన ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోలేనని చెప్పేవారు కృష్ణంరాజు. ఎన్టీఆర్.. కృష్ణంరాజుకు తన చిత్రాలలో ఏవైనా పాత్రలు ఉంటే ఇప్పించేవారు. అలా ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణంరాజు భలే మాస్టర్, బడిపంతులు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, పల్లెటూరి చిన్నోడు, వాడే-వీడు, సతీసావిత్రి చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్ తర్వాత కొన్ని పాత్రలకు కృష్ణంరాజు మాత్రమే న్యాయం చేయగలరని అప్పటి రచయితలు, దర్శకులు భావించేవారు. అలా రూపొందిన 'బొబ్బిలి బ్రహ్మన్న' చిత్రంతో కృష్ణంరాజు జేజేలు అందుకున్నారు. తాండ్ర పాపారాయుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పాత్రల్లోనూ నటించి అలరించారు.
అక్కినేనితో బంధం.. ఏయన్నార్ నటించిన 'దేవదాసు' చిత్రమంటే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం. ఆ సినిమాను పలుమార్లు చూశానని కృష్ణంరాజు చెప్పేవారు. వీరిద్దరు కలిసి బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్రబంధం, రైతుకుటుంబం, మంచిరోజులు వచ్చాయి, కన్నకొడుకు, యస్.పి.భయంకర్ మొదలైన చిత్రాలలో నటించారు.
కృష్ణ- కృష్ణంరాజు.. వీరిద్దరూ దాదాపుగా ఒకే సమయంలో చిత్రసీమలో అడుగుపెట్టారు. కృష్ణకు ఆరంభంలోనే హీరోగా అవకాశాలు వచ్చాయి. అయితే ఇద్దరూ పలు చిత్రాలలో పోటీ పడి నటించారు. కృష్ణ నటించిన అనేక చిత్రాలలో కృష్ణంరాజు విలన్‌గా మెప్పించారు. తర్వాత ఇద్దరూ కలసి హీరోలుగానూ నటించారు. నేనంటే నేనే, మళ్ళీ పెళ్ళి, అమ్మకోసం, పెళ్ళిసంబంధం, అల్లుడే మేనల్లుడు, అనురాధ, రాజ్ మహల్, అంతా మనమంచికే, హంతకులు- దేవాంతకులు, భలే మోసగాడు, ఇన్ స్పెక్టర్ భార్య, ఇల్లు ఇల్లాలు, తల్లీకొడుకులు, శ్రీవారు-మావారు, మమత, మాయదారి మల్లిగాడు, స్నేహబంధం, కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, యుద్ధం, విశ్వనాథనాయకుడు, ఇంద్రభవనం, సుల్తాన్ వంటి చిత్రాలలో నటించారు.