Prabhas chakram movie 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. తన కెరీర్‌లో చేసిన వైవిధ్య చిత్రం 'చక్రం' చేశారు. దర్శకుడు కృష్ణవంశీ దాన్ని తెరకెక్కించారు. విషాదాంత కథతో కూడుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. కాగా, ఓ ఇంటర్వ్యూలో 'చక్రం' మూవీని ప్రభాస్ చేయడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు.
''ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకున్నప్పుడు రెండు రకాల కథలు చెప్పా. అందులో ఒకటి 'చక్రం'. మరొక మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఫ్యాక్షన్ కాకుండా గుప్తనిధులు అనే కాన్సెప్ట్ గురించి వివరించాను. రాయలసీమ జిల్లాల్లోని చాలా ఊళ్లల్లో గుప్తనిధుల కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు. ఆ నిధుల కోసం కొన్ని తరాలు అలా వెతుకుతూనే ఉంటాయి. ఆ నేపథ్యంతో సినిమా చేద్దామన్నా. విశాలమైన మట్టి ప్రాంతాలు, దుమ్ములేపే వెహికల్స్, గుర్రాలపై ఛేజింగ్స్, ఫైట్స్‌తో ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అవుతుందని చెప్పా. కానీ, ప్రభాస్ 'చక్రం' ఎంచుకున్నాడు. అప్పటికీ నేను వద్దని చెప్పా. 'ప్రభాస్ నువ్వు ఇప్పుడు యాక్షన్ జోన్‌లో ఉన్నావు. ఈ సినిమా చేస్తే బాగుంటుంది' అని అన్నాను. పైగా అప్పుడు 'వర్షం' కూడా విడుదలైంది. 'సర్ నా దగ్గరకు అన్నీ ఇలాంటి కథలే వస్తున్నాయి. మంచి నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చా. మీరు ఏమీ అనుకోవద్దు. చక్రం చేద్దాం'' అని ప్రభాస్ దాన్ని ఎంచుకున్నాడని అన్నారు.