తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా పరిచయమైన ఆయన.. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగారు. మధ్యలో కొన్ని పరాజయాలు ఇబ్బంది పెట్టినా.. కొంత కాలం నుంచి విభిన్నమైన కథలతో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలను లైన్లో పెట్టే పనుల్లో బిజీగా ఉన్నారయన. అలా ఆర్ఆర్ఆర్ సమయంలోనే ఆయన దర్శకుడు కొరటాలతో ఓ సినిమాను ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో అది పట్టాలెక్కనుంది.
'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. నందమూరి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్ని చకచకా పూర్తి చేసుకుంటోంది. అయితే ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఆరు వేళ్లు ఉన్న చేతితో కనిపించబోతున్నారట. ఆ ఎక్స్‌ట్రా ఫింగరే ఆయన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారని తెలిసింది. ఆయనకు కోపం వచ్చిన ప్రతీసారి ఆరో వేలు బిగుసుకు పోవడం ఓ సింబాలిక్‌గా నిలుస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో 'రక్షకుడు' సినిమాలో నాగార్జున కోపం వచ్చినప్పుడు నరాలు బయటకు వచ్చినట్లు ఎలా చూపించారో అలానే ఇప్పుడు తారక్‌ను కూడా అలానే చూపించనున్నారట. ఇక కథలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలిసింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.