తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2022, 7:32 AM IST

ETV Bharat / entertainment

అమితాబ్​తో రామ్​గోపాల్​ వర్మ కొత్త సినిమా.. నవంబరులో సెట్స్​పైకి

Ramgopal varma Amitab bachan movie: బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​తో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలిపారు దర్శకడు రామ్​గోపాల్​వర్మ. హారర్​ జోనర్​లో మూవీ ఉంటుందని, నవంబరులో సెట్స్​పైకి వెళ్లే అవకాశముందని చెప్పారు.

amitab bachan ramgopal varma
అమితాబ్​ బచ్చన్​ రామ్​గోపాల్​ వర్మ

Ramgopal varma konda movie: నిజ జీవిత కథల్ని తెరకెక్కించడంలో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మది అందెవేసిన చేయి. ఇలా ఆయన నుంచి వచ్చిన 'రక్తచరిత్ర', 'వీరప్పన్‌', 'వంగవీటి' వంటివి సినీప్రియుల్ని మెప్పించాయి. ఇప్పుడాయన నుంచి వస్తున్న మరో బయోపిక్‌ 'కొండా'. కొండా మురళి - సురేఖ దంపతుల జీవితకథతో రూపొందింది. మురళి పాత్రను త్రిగుణ్‌ పోషించగా.. సురేఖ పాత్రలో ఇర్రా మోర్‌ నటించింది. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు వర్మ.

'కొండా' చిత్రం తెరకెక్కించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
"విజయవాడలో చదువుకోవడం వల్ల అక్కడి రౌడీయిజంపై కొంత అవగాహన ఉంది. 'రక్తచరిత్ర' తీసినప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలిసింది. తెలంగాణ గురించి పెద్దగా తెలియదు. ఓసారి ఒక రిటైర్డ్‌ పోలీస్‌ అధికారితో మాట్లాడుతున్నప్పుడు కొండా మురళి - సురేఖ దంపతుల గురించి చెప్పారు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. తర్వాత కొంతమంది నక్సలైట్లతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నా. కొండా దంపతుల జీవితంలో చాలా డ్రామా, ట్విస్ట్‌లు కనిపించాయి. సినిమా తీయాలనిపించింది. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి.. వాళ్లందరినీ కూర్చొబెట్టి నా ఆలోచన చెప్పా. స్క్రిప్ట్‌ విన్నాక తమ జీవితానికి దగ్గరగా ఉందని అనుకున్నారు. 'మీకు అభ్యంతరం లేకపోతే నేను నిర్మిస్తాన'ని సుష్మితా అడగడంతో ఒప్పుకొన్నా".
ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్న అంశాలేంటి? వాటిలో వాస్తవమెంత? కల్పితమెంత?
"ఈ సినిమాలో కొండా దంపతుల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు జరిగిన ప్రయాణాన్ని చూపించాం. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు జరిగే కథగా ఉంటుంది. నేను ఇతరుల నుంచి తెలుసుకున్న సమాచారంలో నమ్మినవి, నాకు నిజంగా అనిపించినవి దీంట్లో చెప్పాను. మురళి పాత్రకు త్రిగుణ్‌ బాగా కుదిరాడు. అతన్ని చూసినప్పుడే ఇలాంటి ఇంటెన్స్‌ యాక్షన్‌ సినిమా తనకి బావుంటుందనిపించింది".

కొండా దంపతులపై వచ్చిన ఆరోపణలు, విమర్శల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారా?
"నేరం ఎప్పుడూ నేరమే. అయితే ఆ నేరం వెనకున్న కారణమేంటి? అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వంటి అంశాల్ని ఎలా చూపించానో తెలియాలంటే 'కొండా' చూడాలి. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం గద్దర్‌తో కలిసి ఓ పాట పాడాను".
సినిమా బాగున్నా.. టికెట్‌ ధరలు తగ్గించినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే మాట వినిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి?
"పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం. పరిస్థితులు ఇంకొకటి చేస్తాయి. 'టికెట్‌ రేట్లు తగ్గించి, సినిమాల్ని చంపేస్తున్నార'ని నాలుగు నెలల క్రితం ఏడ్చి, గగ్గోలు పెట్టేశారు. కాళ్లావేళ్లా పడి.. బతిమలాడి టికెట్‌ రేట్లు పెంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితుల్ని బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుల్ని.. ఎన్నికల్లో ఓటు వేసే ఓటర్లని విశ్లేషించాలనుకోవడం మూర్ఖత్వమవుతుంది. వాళ్ల నుంచి ఓ ఫలితం వచ్చాక.. 'ఓహో ఇలాగై ఉండొచ్చ'ని ఒకరనుకుంటే.. 'అలాగై ఉండొచ్చ'ని మరొకరు అనుకుంటారు. ఎవరి విశ్లేషణ వాళ్లు చేసుకుంటారు. ఏ చిత్రం ఎందుకు ఆడిందన్నది ఎవరూ చెప్పలేరు".

కొత్త చిత్ర విశేషాలేంటి?
Ramgopal varma Amitab movie: "లడకీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అమితాబ్‌ బచ్చన్‌తో ఓ హారర్‌ సినిమా చేయనున్నా. అది నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లొచ్చు".
నిజ జీవిత కథల్ని తెరకెక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకిలా?
"నిజ జీవితంలో ఉన్నంత డ్రామాని ఏ స్క్రిప్ట్‌ రైటర్‌ చేయలేడన్నది నా బలమైన నమ్మకం. నా తొలి సినిమా 'శివ'ని అంత విభిన్నంగా తీయగలగడానికి కారణం.. దాంట్లో రియాలిటీని చూపించడమే. మా కాలేజీలో చూసిన యథార్థ సంఘటనల్ని దాంట్లో చూపించడం వల్లే. ‘సర్కార్‌’, ‘సత్య’ ఇలా నా నుంచి వచ్చిన ప్రతి చిత్రంలోనూ ఆ వాస్తవికత ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది".

ఇదీ చూడండి:'సాయి పల్లవికి జాతీయ పురస్కారం పక్కా!'

ABOUT THE AUTHOR

...view details