Kicha Sudeep Vikranth Rona: నాగార్జున నటించిన శివ సినిమా స్ఫూర్తితో సైకిల్ చైన్లను తీసుకుని బ్యాగ్స్‌లో పెట్టుకుని తిరిగేవాడినని అన్నారు హీరో కిచ్చా సుదీప్. తాను థియేటర్‌లో చూసిన తొలి చిత్రం కూడా అదేనని చెప్పారు. ఆయన నటించిన తాజా మూవీ 'విక్రాంత్ రోణ'. అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జునను ఉద్దేశించి ఆయన ఈ విధంగా మాట్లాడారు.
ఒక్క ఫోన్ కాల్‌తో వచ్చారు.."టెలివిజన్‌లో నేను చూసిన తొలి తెలుగు సినిమా 'రాముడు- భీముడు'. థియేటర్‌లో చూసిన తొలి తెలుగు చిత్రం 'శివ'. నేను ఈ సినిమాని 2 రోజుల్లో 3 షోలు చూశా. సైకిల్ చైన్‌తో ఎవరినైనా కొట్టొచ్చని ఈ చిత్రం చూసేంత వరకూ ఎవరికీ తెలియదు. ఆ స్ఫూర్తితో నా స్నేహితులతో కలిసి సైకిల్ షాప్‌కు వెళ్లి, అక్కడున్న చైన్లు తీసుకుని బ్యాగ్స్‌లో పెట్టుకునేవాడ్ని. ఇతరులను సరదాగా భయపెట్టేందుకు అలా చేసేవాడ్ని. అలాంటిది ఆ సినిమా హీరో నాగార్జున సర్ పక్కన నేను నిల్చోవడం సంతోషంగా ఉంది. ఆయన్ను నేరుగా కలవకపోయినా ఒక్క ఫోన్ కాల్ చేసి ఆహ్వానించగానే ఈ వేడుకకు వచ్చారు. థ్యాంక్స్ నాగార్జున సర్. 'విక్రాంత్ రోణ' సినిమా చిత్రీకరణ సుమారు 70 శాతం హైదరాబాద్‌లోనే సాగింది. ఇందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ చేశాం. 'ఈగ', 'బాహుబలి', 'సైరా'.. ఇలా తెలుగు సినిమాల్లో నేను ఏ చిన్న పాత్ర పోషించినా నన్ను మీరు ఆదరించారు" అని సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.