KETIKA SHARMA INTERVIEW: ఫలితం గురించి ఆలోచించకుండా పని చేస్తానంటోంది కేతిక శర్మ. 'రొమాంటిక్'తో యువతకు అందాల ట్రీట్ ఇచ్చిన కథానాయిక ఈమె. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ద్వితీయ ప్రయత్నంగా 'లక్ష్య'ను ఎంపిక చేసుకుని, ఆకట్టుకుంది. ఇప్పుడు.. 'రంగ రంగ వైభవంగా' సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా కేతిక శర్మ ఈటీవీ భారత్తో పంచుకున్న విశేషాలివీ..
* హీరోయిన్గా మూడు చిత్రాల్లో నటించారు.. ఏం నేర్చుకున్నారు?
కేతిక: రొమాంటిక్, లక్ష్య.. ఈ రెండు సినిమాలు నాకు చాలా నేర్పించాయి. రెండు చిత్ర బృందాలు నాకు చాలా సపోర్ట్ చేశాయి. అందుకే సినీ పరిశ్రమ నాకు కొత్త అయినా నేను కంగారు పడలేదు. కెరీర్ ప్రారంభంలోనే మంచి వ్యక్తుల పరిచయం నాలో స్ఫూర్తినింపింది. ఆయా చిత్రాల నటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. నా మూడో సినిమా 'రంగరంగ వైభవంగా' వాటికి కాస్త భిన్నం. ఇందులో ఎక్కువమంది సీనియర్ నటులతో కలిసి నటించే అవకాశం లభించింది. ప్రభు, నరేశ్, తులసి, ప్రగతిలాంటి వారితో కలిసి తెరను పంచుకోవటం మరిచిపోలేని జ్ఞాపకం. నటిగా వారి దగ్గర ఎంతో నేర్చుకున్నా.
* మొదటి రెండు సినిమాలు మిశ్రమ ఫలితాన్నివ్వడం ఎలా అనిపించింది?
కేతిక: నేనసలు సినిమా ఫలితం గురించి ఆలోచించను. నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేశాను? అని మాత్రమే ప్రశ్నించుకుంటా. అలా నా తొలి రెండు సినిమాలు నాకు నటిగా సంతృప్తి ఇచ్చాయి. ఏ సినిమాకైనా నా పూర్తి స్థాయి నటన అందించడానికి కృషి చేస్తా.
* ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలనుకుంటారు?
కేతిక: 'రొమాంటిక్' పూర్తిగా యూత్ ఓరియెంటెడ్ సినిమా. 'లక్ష్య' క్రీడా నేపథ్యంలో వచ్చింది. 'రంగ రంగ వైభవంగా'.. ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేనెప్పుడూ ఒకే రకమైన కథలను ఎంపిక చేసుకోవాలనుకోను. సినిమా సినిమాకీ వైవిధ్యం ఉండేలా చూసుకుంటా. అందుకే నేను నటించిన మూడు సినిమాలు మూడు నేపథ్యాల్లో ఉంటాయి.
* 'రంగ రంగ వైభవంగా'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
కేతిక:ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. పక్కింటమ్మాయిలా కనిపిస్తా. తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసే పాత్ర ఇది. ఇంతకుముందు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేశా. రాధ పాత్ర వాటికి భిన్నంగా సంప్రదాయంగా ఉంటుంది. నటనకు ఎక్కువ ఆస్కారం ఉంది. 'ఖుషి' సినిమాలోని కథానాయిక భూమిక పాత్రను గుర్తుచేస్తుంది.