తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తరుణ్ భాస్కర్‌ కొత్త ప్రయత్నం - 'కీడా కోలా' ప్రేక్షకులను మెప్పించిందా?

Keedaa Cola Review In Telugu : తరుణ్​ భాస్కర్​, చైతన్య రావు, బ్రహ్మనందం లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ కామడీ ఎంటర్​టైనర్​ 'కీడా కోలా'. ట్రైలర్​తో ఆద్యంతం నవ్వించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 6:41 AM IST

Keedaa Cola Review In Telugu : చిత్రం: కీడా కోలా; నటీనటులు: చైతన్య మందాడి, , బ్రహ్మానందం, రాగ్‌ మయూర్‌ తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, రవీంద్ర విజయ్‌, విష్ణు, రఘురామ్‌; సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌; సంగీతం: వివేక్‌ సాగర్‌; ఎడిటింగ్‌: ఉపేంద్ర వర్మ; సమర్పణ: రానా దగ్గుబాటి; నిర్మాత: కె.వివేక్‌ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నండూరి, శ్రీపాద్‌ నందరాజ్‌, ఉపేంద్ర వర్మ; రచన సహకారం: ప్రణయ్‌ కొప్పల, రమ్య కాకుమాను, సనాతన్‌ రాజ్‌; రచన, దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌; విడుదల: 03-11-2023

ఈ వారం ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో 'కీడా కోలా' ఒకటి. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​ ఉన్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే ?

క‌థేంటంటే: వాస్తు (చైత‌న్య‌రావు), అత‌ని తాత వ‌ర‌ద‌రాజు (బ్రహ్మానందం) లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌) వీళ్లంద‌రిదీ ఒకే ఒక లక్ష్యం డ‌బ్బు సంపాదించడ‌మే. తాత కోసం కొన్న ఓ కూల్​ డ్రింక్​ బాటిల్​లో బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్ (జీవ‌న్‌)కి కార్పొరేట‌ర్ కావాల‌నేది ఆశ‌. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. జీవ‌న్ కార్పొరేట‌ర్ కావాల‌న్నా కూడా డ‌బ్బే అవ‌స‌రం కావ‌డం వల్ల అందుకోసం వీళ్లందరూ కూడా ఓ ప్లాన్​ వేస్తారు. మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా? అసలు వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? ఇంత‌కీ కోలాలోకి ఆ బొద్దింక ఎలా ప‌డింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:'కీడా... ఇందులో ఉంది తేడా' అంటూ సినిమాలో వినిపించే డైలాగ్స్​ కొన్ని తేడాగా వ్య‌వ‌హ‌రించే పాత్ర‌ల చుట్టూ సాగే ఓ క్రైమ్ కామెడీ క‌థ ఇది. గ‌మ్మ‌త్తైన పాత్ర‌లు, వాటి కోరిక‌లు, అసంబద్ధంగా అనిపించే ప్ర‌య‌త్నాలతో న‌వ్విస్తూ సాగుతుంది ఈ చిత్రం. త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ స‌న్నివేశాల్ని న‌డిపించారు దర్శకుడు. అందుకు పూర్తి భిన్నంగా లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు.

త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ మువీ ఇది. ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో మాత్రం ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌తోనూ, సంగీతంతోనూ, మాట‌ల‌తోనూ, పాత్ర‌ల హావ‌భావాల‌తోనూ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ కొత్త ర‌క‌మైన ప్ర‌య‌త్నమే ఈ చిత్రం. వాస్తు, తాత‌, లాయ‌ర్ కోణంలో మొద‌ల‌య్యే ఈ సినిమా.. జీవ‌న్ పోస్ట‌ర్ డిజైన్ నుంచి ఊపందుకుంటుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీ ఇచ్చాక క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. స‌ర‌దా స‌ర‌దా సీన్స్​తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది.

ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా ఆరంభం అవుతుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. నాయుడుని అంతం చేయ‌డానికి షాట్స్ ప‌లువురు షార్ప్ షూట‌ర్స్‌ని రంగంలోకి దించ‌డం, వాళ్లు చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌. బ్ర‌హ్మానందం పాత్ర వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనప్పటికీ సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది. మిగ‌తా పాత్ర‌ల్లాగే గ‌మ్మ‌త్తుగా అనిపించినా... నాయుడు పాత్ర అంత‌ర్లీనంగా బ‌ల‌మైన సందేశాన్ని పంచుతుంది. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినప్పటికీ, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతూ అవ‌స‌ర‌మైనప్పుడంతా ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే చిత్ర‌మిది.

ఎవ‌రెలా చేశారంటే: ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌... ఈ సినిమాలో ఓ న‌టుడిగానూ మెరిశాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీలో టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినప్పటికీ... చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ఎఫెక్ట్​ అందులో క‌నిపిస్తుంటుంది. చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న ఓ యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని ఆ పాత్ర‌లో మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు.

రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా న‌వ్విస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు కూడా చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది. కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణంలో లోపాలేమీ లేవు.

  • బ‌లాలు
  • + కామెడీ... ర‌చ‌న
  • +న‌టులు
  • +సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • -ఊహ‌కు అందేలా క‌థ‌నం
  • చివ‌రిగా: కీడాకోలా... న‌వ్వించే కీడా
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details