Karthikeya 2 Trailor: సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కార్తికేయ 2' ఒకటి. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జులై 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏఎంబీ సినిమాస్ స్క్రీన్- 3లో చిత్ర బృందం తొలి ట్రైలర్‌ను ఆవిష్కరించింది. సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌తో అర్థమైంది. దానికి సంబంధించి ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. 'అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?' అంటూ నిఖిల్.. 'విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే' అంటూ అనుపమ్ ఖేర్ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
నిఖిల్- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందుతుండటంతో 'కార్తికేయ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలకాబోతోంది.
'థ్యాంక్ యూ' విడుదల అప్పుడే: అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్ యూ'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 22న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకం పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్,మాళవిక నాయర్ కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు.