తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మళ్లీ వాయిదా పడిన 'కార్తికేయ 2'.. విడుదల ఎప్పుడో తెలుసా? - కార్తికేయ 2 ప్రెస్​మీట్

Karthikeya 2 press meet: నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన 'కార్తికేయ 2'ని మరోసారి వాయిదా వేసింది చిత్ర యూనిట్​. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు నటుడు నిఖిల్​. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'కార్తికేయ 2' టీమ్‌ చెప్పిన విశేషాలు తెలుసుకోండి

karthikeya 2 press meet
karthikeya 2 press meet

By

Published : Aug 3, 2022, 6:45 PM IST

Karthikeya 2 press meet: 'అన్ని సినిమాలు ఆడాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలి' అనే ఉద్దేశంతోనే ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రం 'కార్తికేయ 2'ని మరోసారి వాయిదా వేశామని నటుడు నిఖిల్‌ తెలిపారు. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. నిఖిల్‌ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. మీడియా సమావేశంలో 'కార్తికేయ 2' టీమ్‌ చెప్పిన వివరాలివీ..

ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటానికి కారణమేంటి?

నిఖిల్:అదొక మిస్టరీ. కొవిడ్‌ సమయంలో సినిమాలు వాయిదా పడటం సహజం. కానీ, మా చిత్రం ఆ తర్వాతా వాయిదా పడుతూనే వచ్చింది. అన్ని సినిమాలు ఆడాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా ఉండాలనున్నాం. దాంతో, ప్రతిసారీ మా చిత్రమే వెనక్కి వెళ్లేది. ఈ విషయంలో నేను బాధపడ్డా.

మీ గత చిత్రం 'అర్జున్‌ సురవరం' చాలా సార్లు వాయిదా పడి, హిట్‌ అయింది. 'కార్తికేయ 2' అలానే వాయిదా పడింది. దాన్ని సెంటిమెంట్‌ అనుకుంటున్నారా?

నిఖిల్:ఏదైనా గండం ఉంటేనో, ఇంకేదైనా అయితేనో చిత్రం విజయవంతమవుతుందనేది ఏ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకీ జరిగిఉండదు (నవ్వుతూ..). మీరు చెప్పారు కాబట్టి అది నిజమవుతుందేమో అని అనిపిస్తోంది.

ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకాబోతుంది. మీరు పాన్‌ ఇండియా హీరో అయిపోయాననుకుంటున్నారా?

నిఖిల్:గతంలోనే దీని గురించి చెప్పా. ఈ సినిమాలో హీరో నేను కాదు. మా కథే హీరో. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌ ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతోనే పలు భాషల్లో విడుదల చేస్తున్నాం. పాన్‌ ఇండియా కాదు.. దీన్ని మల్టీ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అని మేం భావిస్తున్నాం.

నటుడిగా 15 ఏళ్ల అనుభవం ఉన్న మీకే సినిమా విడుదల విషయంలో ఇలా జరిగితే కొత్తగా వచ్చే వారి పరిస్థితేంటి?

నిఖిల్:జీవితంలో మనం అనుకున్నది ఏదీ అంత తేలికగా అయిపోదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే విజయం సాధిస్తాం. సినీ రంగమే కాదు ఏ ఫీల్డ్‌లోకైనా ధైర్యంగా అడుగుపెట్టండి. విజయం వరిస్తుంది.

'కార్తికేయ'కి 'కార్తికేయ 2'కి కనెక్షన్ ఉంటుందా? 'కార్తికేయ' హీరోయిన్‌ స్వాతి ఇందులో కనిపిస్తారా?

చందూ: 'కార్తికేయ', 'కార్తికేయ 2'.. రెండు వేర్వేరు అడ్వెంచర్‌ చిత్రాలు. రెండింటికీ కనెక్షన్‌ అని కాదుగానీ ఇంచుమించు ఒకే థీమ్‌లో సాగుతాయి. ఒకవేళ 'కార్తికేయ' సినిమా చూడకపోయినా సీక్వెల్‌ అర్థమవుతుంది. 'కార్తికేయ 2'లో స్వాతి పాత్రను తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈ చిత్రానికి మరికొన్ని సీక్వెల్‌ తీయాలనే ఆలోచన ఉంది.

'కార్తికేయ'లో యానిమల్‌ హిప్నాటిజం గురించి చూపించారు. సీక్వెల్‌లో ఆ కాన్సెప్ట్‌ ఉంటుందా?

చందూ: అది ఉంటుందా, లేదా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ని ఎంపిక చేయడానికి కారణం?

చందూ: ఈ సినిమా స్టోరీ ఎక్కువగా హిమాచల్‌ ప్రదేశ్‌ చుట్టూ తిరుగుతుంది. సంబంధిత కీలక సన్నివేశాల కోసం ముగ్గురు ప్రముఖ నటులను అనుకున్నాం. చివరగా అనుపమ్‌ ఖేర్‌ని తీసుకున్నాం. మా నిర్మాత అభిషేక్‌ గారికి ఆయన బాగా పరిచయం. (అభిషేక్‌ నిర్మించిన 'కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రంలో అనుపమ్‌ ప్రధాన పాత్ర పోషించారు).

ఇవీ చదవండి:ఆ నటితో 'జానకి కలగనలేదు' హీరో ఎంగేజ్​మెంట్​.. షాక్​లో ఫ్యాన్స్​​!

'దక్షిణాది చిత్రాలూ సరిగ్గా ఆడటం లేదు.. బాలీవుడ్​పై కాస్త దయ చూపించాలి'

ABOUT THE AUTHOR

...view details