Karthikeya 2 Movie: "'కార్తికేయ2'ను హిందీలో సరదాగా విడుదల చేద్దామని 50 థియేటర్‌లలో విడుదల చేశారు. రెండో రోజున అది 200 థియేటర్లకు, ఇవాళ అది 700లకు పైగా థియేటర్‌లలో ఆడుతోంది. ఒక సినిమా భాషాపరంగా సరిహద్దులు దాటుకుని, ప్రజల గుండెల్లోకి వెళ్లింది. ఇలాగే 'పుష్ప' కూడా నెమ్మదిగా మొదలై, ఇరగొట్టేసింది" ఈ మాటలు అన్నదెవరో కాదు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ గణాంకాలు చాలు, హిందీ ప్రేక్షకులు 'కార్తికేయ2'ను ఎంత ఆదరిస్తున్నారో చెప్పడానికి. బాలీవుడ్‌లో సొంత సినిమాలు ఒక్కొక్కటి వికటిస్తుంటే.. అదే సమయంలో దక్షిణాది సినిమాలు అక్కడ సత్తా చాటుతున్నాయి.
'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్2', 'విక్రమ్'లు మెప్పించగా.. ఇప్పుడు 'కార్తికేయ2' వంతు వచ్చింది. తెలుగులో వైవిధ్య కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్ కీలక పాత్రలో చందూ మొండేటి దీన్ని తెరకెక్కించారు. గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం... 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. కేవలం ఒక్క సోమవారం నాడే రూ.6.50 కోట్లు వసూలు చేసింది.
మొత్తం మూడు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే ఏకంగా రూ.17.55 కోట్లు (హిందీ/తెలుగు) రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో హిందీలో స్క్రీన్‌లను పెంచే పనిలో పడ్డారు ఎగ్జిబిటర్స్. ఇది ఇలాగే కొనసాగితే సింగిల్ డే కలెక్షన్ రూ.కోటి వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు సినిమా బడ్జెట్ రూ.15కోట్ల మార్కును 'కార్తికేయ2' దాటేసింది.