Karthikeya 2 Movie Director: చందు మొండేటి.. తొలి చిత్రం 'కార్తికేయ'తో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు. 'ప్రేమమ్', 'సవ్యసాచి' సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. ఇప్పుడు 'కార్తికేయ 2'తో థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు తెరకెక్కించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చందు పలు విశేషాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
అంచనాలకు తగ్గట్టు..
విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కథ, విజువల్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ వారు ఏం ఆశిస్తారో అంచనా వేసుకొని దానికి తగ్గట్టు తెరకెక్కించాల్సి వస్తుంది. 'కార్తికేయ' క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్ రూపొందించా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
శ్రీ కృష్ణుడి గురించి..
అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోవడం, అడ్వెంచర్ కథలు చదవటమంటే నాకు బాగా ఇష్టం. వాటితోపాటు మహాభారతం, రామాయణం చదువుతూ పెరిగా. ఆ ఇతిహాసాలకు నాదైన శైలిలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి సినిమాలు చేయాలనుకుంటుంటా. అలా శ్రీ కృష్ణుడి గురించి ఈ సినిమాలో చెప్పాలనుకున్నా. ఈ ఆలోచనని ముందుగా నిఖిల్‌తోనే పంచుకున్నా. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఈ సినిమా నిర్మించాం.
మరిన్ని సీక్వెల్స్..!
'కార్తికేయ', 'కార్తికేయ 2'.. ఈ రెండు సినిమాల కథలు వేరు. కానీ, హీరో పాత్ర ఒకేలా ఉంటుంది. హీరో అందులో మెడికల్ స్టూడెంట్.. ఇందులో డాక్టర్. 'కార్తికేయ'ను చూడని వారికీ ఈ సీక్వెల్ అర్థమవుతుంది. కృష్ణుడు ఉన్నాడా, లేడా? అనేది చాలామందికి ఉన్న సందేహం. దాని గురించే చెప్పే చిరు ప్రయత్నమే ఈ సినిమా. ఈ చిత్రానికి దక్కే ప్రేక్షకాదరణపై తదుపరి సీక్వెల్స్ ఆధారపడి ఉన్నాయి.