భారీ అంచనాల మధ్య విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా ప్రేక్షకాదరణ పొందుతూ సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ సినిమా చూసిన ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఓ ప్రైవేటు స్క్రీన్‌లో 'పొన్నియిన్ సెల్వన్' చూసిన రజనీకాంత్.. మణిరత్నంతో పాటు నటీనటులందరినీ వ్యక్తిగతంగా పిలిచి మెచ్చుకొన్నారు. మరోవైపు కమల్‌హాసన్ 'పొన్నియిన్ సెల్వన్' హీరోలు కార్తీ, విక్రమ్‌తో కలిసి ఆ సినిమాను వీక్షించారు. అనంతరం సినిమా టీం అందరినీ అభినందించారు.
రజనీ, కమల్‌ను ఉద్దేశిస్తూ కార్తీ ట్వీట్ చేశారు. "రజనీకాంత్ సర్ మీ నుంచి వచ్చిన కాల్ చాలా ప్రత్యేకమైనది. ఇతరుల పనిని మెచ్చుకొని వారిని ప్రొత్సహించడంలో మీరెప్పుడూ ముందుంటారు. ధన్యవాదాలు". "కమల్ సర్ నేను ఉన్నత లక్ష్యాలను చేరడానికి నాకు మీరెప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు. దానికి మించి ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను"అంటూ కృతజ్ఞతలు తెలిపారు.