తన నటనతో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగులో అగ్రతారల్లో ఒకరిగా కొనసాగుతూ అశేష అభిమానుల మనసులను గెలుచుకున్నారు. తారక్.. కన్నడలోనూ జనాదరణ పొందారు. తాజాగా కర్ణాటక విధాన సౌధలో జరగబోయే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో తారక్ కర్ణాటక ప్రయాణంపై ఆసక్తి నెలకొంది.
సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న జూనియర్ ఎన్టీఆర్ - జూ ఎన్టీఆర్ కర్ణాటక అసెంబ్లీ
తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. తాజాగా ఈ స్టార్ నటుడు కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. తారక్ కర్ణాటక ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నవంబర్ 1న జరగబోయే కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి తారక్ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక అత్యున్నత పురస్కారం 'కర్ణాటక రత్న' అవార్డు ఇవ్వనున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం తారక్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి రావడానికి తారక్ సుముఖత వ్యక్తం చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం ఆహ్వానించామని చెప్పారు. కన్నడ ప్రజల్లో పునీత్‌కు ఉన్న గౌరవానికి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నామని బొమ్మై తెలిపారు.
ఈ కార్యక్రమానికి పునీత్ రాజ్ కుమార్ కుంటుంబంతోపాటు జ్ఞనపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్ను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు, కవులు, కళాకారులు, రచయితలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ 23న కన్నుమూశారు. ఈ అవార్డు అందుకున్న 9వ వ్యక్తిగా ఆయన నిలవనున్నారు పునీత్.