భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు 'కాంతార'. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు, ఆ పాత్రలో ఆయన నటన మెప్పిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు.
"దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి భాజపా నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు" అని పీసీ మోహన్ పేర్కొన్నారు.