బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా వింత అనుభవాన్ని ఎదుర్కొంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన కొడుకు జహంగీర్ అలీఖాన్‌తో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు చుట్టుముట్టారు. కొంతమంది తనతో సెల్పీలు తీసుకున్నారు.
కొద్దిసేపు అభిమానులతో గడిపిన కరీనా.. తర్వాత వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, కొందరు ఇంకా సెల్పీలు తీసుకునే ప్రయత్నం చేశారు. తన చేతిని పట్టుకుని అక్కడే ఉండాలని కోరే ప్రయత్నం చేశారు. సెల్ఫీ కోసం ఒక అభిమాని ఆమె భుజానికి అడ్డంగా చేయి వేయబోయాడు. వెంటనే ఆమె వ్యక్తిగత సిబ్బంది వారించాడు. ఈ ఘటనతో కరీనా భయపడింది. వెంటనే భద్రతా సిబ్బంది కరీనాను ఎయిర్‌పోర్టు లోపలికి తీసుకెళ్లారు.
దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. "ఇది సరైన పద్దతి కాదు, అభిమానులు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి" అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. "ఆమె నిజంగా భయపడింది. ప్లీజ్.. సెన్సిటివ్‌గా ఉండాలి. వారు కూడా మనుషులే అని గమనించాలి" అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.