కన్నడ స్టార్ నటించిన రీసెంట్ హిట్ మూవీ వేదా. కన్నడలో హిట్ కొట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివ రాజ్ కుమార్ విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
తెలుగు చిత్రపరిశ్రమ, ప్రేక్షకులతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
"నాకు ఈ పరిశ్రమతో.. ఇక్కడి ప్రేక్షకులతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన నా 'కిల్లింగ్ వీరప్పన్'తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అలాగే బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో నటించా. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టాక అందులో చిత్రీకరణ జరుపుకున్న తొలి కన్నడ చిత్రం నాదే. ఇక్కడి 'ఉలవచారు బిర్యానీ' అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్.. ఇలా నాకెంతో మంది మంచి స్నేహితులున్నారు. వాళ్లు నన్నెంతో ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడీ 'వేద'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది".
ఈ 'వేద' కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?
"మంచి సందేశంతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. కుటుంబంలో సమస్యలొచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది ఈ సినిమాలో చూపించాం. ప్రేమ, జీవితం, సంతోషం, నమ్మకం.. ఈ నాలుగంశాలేే వేద జీవితంలో కనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులకు ఈ కథతో చక్కగా కనెక్ట్ అవుతారు."
ట్రైలర్ చూస్తుంటే.. సినిమాలో యాక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది..
"ఇదేమీ పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. ఇందులో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రంలో ఆడవాళ్లు ఫైట్స్ చేస్తారు. అదెందుకనేది తెరపై చూసినప్పుడు అర్థమవుతుంది. సమాజంలో ఆడవాళ్లు ఎప్పట్నుంచో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లు బలంగా నిలబడాలి. వారిని మనం ప్రోత్సహించాలి. ఈ అంశాలన్నింటినీ దీంట్లో చర్చించాం."