తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2022, 6:46 AM IST

Updated : Apr 26, 2022, 6:58 AM IST

ETV Bharat / entertainment

టాలీవుడ్​లో కన్నడ కస్తూరీల జోరు!

kannada heroines in Tollywood: టాలీవుడ్​లో హీరోయిన్​లుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ తమ అందచందాలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు. అయితే వీరిలో అధిక శాతం కన్నడ కస్తూరీలే ఉండటం విశేషం. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వీరి జోరే కొనసాగుతోంది. ఓ సారి ఆ భామలెవరో తెలుసుకుందాం..

kannada heroines in Tollywood
kannada heroines in Tollywood

kannada heroines in Tollywood: అయితే ముంబయి భామలు.. లేదంటే మలయాళీ హీరోయిన్లు.. నిన్నామొన్నటి వరకు టాలీవుడ్‌లో ఆధిపత్యం వారిదే. ఈ ఆనవాయితీని బద్దలు కొట్టి, ఇప్పుడు కన్నడ కథానాయికలు దూసుకెళ్లిపోతున్నారు. అగ్ర కథానాయకుల చిత్రాల్లోనే కాదు.. చిన్న బడ్జెట్‌ సినిమాలలోనూ ప్రస్తుతం వీరి హవానే నడుస్తోంది. కన్నడ చిత్రసీమతో పోలిస్తే ఇక్కడ అత్యధికంగా భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కడం, పెద్దఎత్తున పారితోషికాలు ముట్టజెప్పడం, తారలను ఆరాధించే ప్రేక్షకులు.. వెరసి కన్నడ కస్తూరీలు తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో బి.సరోజా దేవి, జయంతి.. తర్వాత సౌందర్య, మాలాశ్రీ, రక్షిత, ప్రణీత.. నిన్నటిదాకా 'స్వీటీ' అనుష్కశెట్టి అడపాదడపా తెలుగు తెరను ఏలినవారే. ఇప్పుడు మాత్రం వీరి జోరు పెరిగిందని చెప్పక తప్పదు. తెలుగు తెరపై కన్నడ పరిమళాలు వెదజల్లుతున్న కొందరు తారల గురించి.

విజయాల ఉప్పెన.. తెలుగు తెరపైకి 'ఉప్పెన'లా దూసుకొచ్చిన నటి కృతి శెట్టి. మంగళూరుకు చెందిన ఈ టీనేజీ అందం మొదటి సినిమా విడుదల కాక ముందే పరిశ్రమ చూపును తన వైపునకు తిప్పుకుంది. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చే లోపే రెండు సినిమాలకు జోరుగా పచ్చజెండా ఊపేసింది. నానితో 'శ్యామ్‌సింగరాయ్‌', నాగచైతన్య 'బంగార్రాజు', సినిమాలతో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్‌తో కలిసి నటించిన ‘ది వారియర్‌’, సుధీర్‌బాబు సరసన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో యువ కథానాయకుడు నితిన్‌తో కలిసి నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. తెలుగులోకి వచ్చిన అనతికాలంలోనే అగ్ర నాయికలకు పోటీ ఇచ్చే స్థాయికి వచ్చిందీ భామ.

కృతిశెట్టి

నా అడ్డా అంటున్న రష్మిక..హే..బిడ్డా.. ఇది నా అడ్డా అంటూ.. దూసుకెళ్తున్న భామ రష్మిక మందన్న. 'చలో' అంటూ నాగశౌర్యతో జోడీ కట్టిన ఈ కొడగు భామ తొలిసారి తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది. తర్వాత విజయ్‌ దేవరకొండతో నటించిన ‘గీత గోవిందం’ హిట్‌ కావడంతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో కొలువుదీరింది. ‘డియర్‌ కామ్రేడ్‌’లో తన నటనకు మంచి మార్కులే పడటంతో మరో మెట్టు ఎక్కింది. మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’లో జోడీ కట్టాక అమ్మడు దిశ తిరిగిపోయింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’లో నటించి అదరగొట్టింది. రాయలసీమ యాసను పలుకుతూ నటనలో ఒదిగిపోవడంతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. తాజాగా రష్మిక ఉంటే సినిమా హిట్టే అనే సెంటిమెంటూ మొదలైంది. ప్రస్తుతం యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో తెరంగేట్రం చేస్తున్న ‘సీతారామమ్‌’లో అఫ్రీన్‌గా అలరించబోతోంది రష్మిక. అల్లు అర్జున్‌ ‘పుష్ప- ది రూల్‌’లోనూ ప్రధాన పాత్ర తనదే.

రష్మిక

ఇస్మార్ట్‌ భామ నభా.. ‘నన్ను దోచుకుందువటే’ అంటూ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడం మొదలు పెట్టిన కన్నడ సుందరి నభా నటేష్‌. శృంగేరీలో పుట్టి, ఉడుపిలో పెరిగిన నభా ఏడేళ్ల కిందట శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ జోరు మీదుండగానే నాలుగేళ్ల కిందట తెలుగు సినిమా మంత్రం జపించింది. అప్పటి వరకూ చిన్నాచితకా పాత్రలతో నెట్టుకొస్తున్న నభా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బూరెల బుట్టలో పడింది. పూరి మార్క్‌ సినిమాగా వచ్చిన ఈ చిత్రంలో నభా నటనకు పరిశ్రమ దాసోహమయ్యింది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. వెంటనే వరసగా ‘డిస్కోరాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్ట్రో’ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం వేగం తగ్గించిన ఈ ముద్దు గుమ్మ ఓ అగ్ర హీరో సినిమాలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

నభా నటాషా

శ్రద్ధగా.. ఒక్కో మెట్టే ఎక్కుతూ..ఈ జాబితాలో చేరిన మరో నటి శద్ధా శ్రీనాథ్‌. మొదటి సినిమా ‘జెర్సీ’తోనే నటనకు ఆస్కారమున్న పాత్ర పడటంతో ఆ అమ్మడి పేరు మార్మోగింది. ఆ చిత్రంలో తను పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసును తాకాయి. ఈ సినిమాకి జాతీయ అవార్డు రావడంతో అందరి దృష్టిలో పడింది. ‘జెర్సీ’ తర్వాత ఆది పినిశెట్టితో ‘జోడీ’ కట్టింది. సిద్ధూ జొన్నలగడ్డతో ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’లో ఆడిపాడింది. వీటి తర్వాత తనే ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘కలియుగం’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నూతనదర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది కాకుండా మహీ రాఘవ్‌ దర్శకత్వంలో ‘సిద్ధా లోకం ఎలా ఉంది నాయనా?’లో సైతం తను ముఖ్య పాత్ర పోషిస్తోంది.

శ్రద్ధా శ్రీనాథ్

మెప్పిస్తున్న మెహబూబా..మంగళూరుకే చెందిన మరో భామ నేహా శెట్టి. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘మెహబూబా’గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆకాష్‌ పూరితో చేసిన రొమాన్స్‌ అందరిచేతా ఔరా అనిపించింది. తర్వాత ‘గల్లీ రౌడీ’లో సందీప్‌ కిషన్‌ సరసన నటించింది. అఖిల్‌ కథానాయకుడిగా వచ్చిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో ప్రేమ సన్నివేశాల్లో పోటీ పడి నటించింది. తాజాగా అందరినీ కడుపుబ్బా నవ్వించిన ‘డీజే టిల్లూ’లో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

  • టాప్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే సైతం కన్నడ మూలాలున్న నటినే.
    కన్నడ కథానాయిక రచితా రామ్‌.. కల్యాణ్‌దేవ్‌ సరసన ‘సూపర్‌ మచ్చి’తో తెలుగు తెరంగేట్రం చేసింది.
    కన్నడ హిట్‌ సినిమా ‘లవ్‌ మాక్‌టెయిల్‌’ని ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో తెలుగు రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్‌ కన్నడ బ్యూటీ కావ్యా శెట్టి ఓ కథానాయిక.
    కన్నడలో పేరున్న నటి అక్షర గౌడ. నాగార్జున ‘మన్మథుడు-2’లో చిన్న పాత్రలో తళుక్కుమంది. రామ్‌ ‘ది వారియర్‌’లో ముఖ్యమైన పాత్రకి ఎంపికైంది.

ఇదీ చూడండి: ఈ లంక బ్యూటీ వెరీ హాట్.. 6 కోట్ల మంది ఫాలోవర్లు!

Last Updated : Apr 26, 2022, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details