అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. నటనతో పాటు దర్శకురాలిగా 'మణికర్ణిక' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు కంగన. దీంతో పార్లమెంటులో షూటింగ్ చేసుకునేందుకు అనుమతించాలని.. లోక్ సభ సచివాలయ కార్యాలయానికి లేఖ రాశారు. అయితే, సినిమా చిత్రీకరణకు అనుమతి నిరాకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కంగనా రనౌత్‌కు ఝలక్.. పార్లమెంటులో 'ఎమర్జెన్సీ' షూటింగ్‌కు నో! - కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా షూటింగ్
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడే అవకాలున్నాయి. పార్లమెంట్లో చిత్రీకరణ కోసం అధికారులను కంగనా అనుమతి కోరారు. అయితే, అనుమతిని తిరస్కరించే అవకాశాలున్నాయి.
'సాధారణంగా ప్రైవేటు వ్యక్తులు పార్లమెంటులో వీడియోగ్రఫీ చేయడానికి అనుమతించరు. ప్రభుత్వ అవసరాల కోసం ఇస్తే అది వేరే విషయం అవుతుంది. పార్లమెంట్ పరిసరాల్లో వీడియోలు తీసేందుకు కేవలం దూర్దర్శన్, సంసద్ టీవీకి మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ పని కోసం పార్లమెంటు లోపల షూటింగ్‌కి ప్రైవేట్ పార్టీకి అనుమతి ఇచ్చిన సందర్భాలు లేవు' అని అధికారులు తెలిపినట్లు సమాచారం.
ఎమర్జెన్సీ చరిత్రలో చాలా కీలకం ..
"ఎమర్జెన్సీ దేశ రాజకీయ చరిత్రలో చాలా కీలకమైన సమయం. అధికారంపై మనం చూసే కోణాన్ని మార్చేసింది. అందుకే ఈ కథను చెప్పాలనుకుంటున్నాను" అని కంగనా గతంలో పేర్కొన్నారు. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించారు. 1977 వరకు దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. 'పింక్' ఫేమ్ రితీశ్ షా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించగా.. కంగనా, రేణు పిట్టీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నట్టు.. ఈ సినిమాకు కథ కూడా కంగనానే అందిస్తున్నారు. కంగనా.. ఇదివరకు దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథపై తెరకెక్కిన తలైవిలో కూడా ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు.