అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఎప్పుటికప్పుడు వివాదాలతో వార్తల్లోనూ నిలుస్తుంటుంది. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తోంది కంగన. అందుకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవలే ఆమె పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చింది.
"నేను నటిగా ఎమర్జెన్సీ షూటింగ్‌కు గుడ్ బై చెప్పేశాను.. ఈ సినిమా కోసం షూటింగ్ చేసిన సమయంలోనే నా జీవితం మొత్తం సంపూర్ణమైన ఫీలింగ్ వచ్చింది.. ఎంతో గొప్పగా షూటింగ్ జరిగిందని నేను చెప్పొచ్చు. కానీ అది అబద్దమే అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సమయంలోనే నేను డెంగ్యూ బారిన పడ్డాను. అప్పుడు ఎన్నో కష్టాలు నన్ను చుట్టుముట్టాయి. రక్తకణాలు తగ్గిపోయాయి. నా మీద నాకే అనుమానం వచ్చే స్థితికి వచ్చాను.. ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నట్టుగా అనిపించింది. ఈ సినిమా కోసం ఆస్తులు కూడా తాకట్టు పెట్టాను."
"నేనెప్పుడూ కూడా సోషల్ మీడియాలో నా భావాలను పంచుకుంటూనే ఉంటాను.. కానీ నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారంతా కూడా ఆందోళన చెందొద్దని కోరుకున్నాను.. ఆ వారి ప్రేమ, ఆందోళన మళ్లీ నా మీద ఒత్తిడిని తీసుకురావొద్దని అనుకున్నాను.. నేను పడిపోతే చూడాలని అనుకునేవారికి చాన్స్ ఇవ్వకూడదని అనుకున్నాను.. నేను ఎంతగా బాధపడుతూ ఉన్నా కూడా బయటకు చెప్పలేదు.. నా బాధ వారికి ఆనందాన్ని కూడా ఇవ్వొద్దని అనుకున్నాను."
" కానీ ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి ఓ కారణం ఉంది.. మన మీద మనకు నమ్మకం ఉండి.. మనం కష్టపడి పని చేస్తే.. నువ్వు సమర్థురాలివి అయితే నిన్ను ఆ దేవుడు మరింత ఎక్కువగా పరీక్షిస్తుంటాడు.. ఆ పరీక్షల్లో నెగ్గాల్సిందే. దానికి కష్టపడాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టొద్దు.. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు పునఃజర్మ వంటిది.. నాకైతే ఇది మళ్లీ చచ్చి పుట్టినట్టు అనిపిస్తుంది.. దానికి సాయం చేసిన నా టీంకు థాంక్స్.. నా గురించి ఎవ్వరూ కంగారు పడకండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఇప్పుడు మీ ప్రేమ, అదరాభిమానాలు, ఆశీస్సులు నాకు కావాలి" అంటూ కంగనా ఎమోషనల్ పోస్ట్ చేసింది.