నటుడిగా, దర్శకుడిగా నిర్మాతగా, గాయకుడిగా, వ్యాఖ్యాతగా రాణిస్తున్న యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్. వాటికే పరిమితం కాకుండా కెమెరా, సౌండింగ్, గ్రాఫిక్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆయనకు పట్టుంది. ఆయన తన సినిమాలకే కాదు.. వేరే హీరోల సినిమాలకు పనిచేశారు! అలా ఆయన ఓ సారి కెరీర్ ప్రారంభంలో అలనాటి హీరో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గాను పనిచేశారట. ఆ సంగతులు..
'కలాతూర్ కన్నమ్మ'లోని సెల్వం అనే పాత్రతో ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న కమల్ వరుస సినిమాలతో బిజీగా గడిపేవారు. అయినా పెద్దయ్యాక నటనవైపు వెళ్లాలని ఆయన అనుకోలేదు. క్లాసికల్ డ్యాన్స్, సంగీతంలో శిక్షణ తీసుకున్న కమల్ డ్యాన్స్ అసిస్టెంట్‌గా మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ టెక్నిషియన్‌గా ఆయన పనిచేసిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' (అక్కినేని నాగేశ్వరరావు హీరో). కమల్‌లోని నటుడిని చెట్టియార్ గుర్తిస్తే రచయితను కమల్ స్నేహితుడు ఆర్. సి. సత్యన్ గుర్తించారు. స్నేహితుడి ప్రోత్సాహంతో కమల్‌కు స్క్రీన్‌ప్లే రాయడంపై ఆసక్తి పెరిగింది. అటు కొరియోగ్రఫీ, ఇటు రైటింగ్ స్కిల్ ఉండటంతో ఆయన ఆ దారుల్లోనే నడవాలనుకున్నారు.