kamalhassan Indian 2 movie: శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఇండియన్-2'పై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఒకే సినిమాపై పదేళ్లు ఉండలేం కదా' అని అన్నారు. 'విక్రమ్'తో సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేసిన కమల్.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. 'ఇండియన్-2' ప్రాజెక్ట్‌పై స్పందించమని విలేకరి కోరగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇండియన్-2’ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. తప్పకుండా ఆ చిత్రాన్ని మేం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. కరోనా, సెట్‌లో యాక్సిడెంట్.. ఇలా సినిమా చిత్రీకరణ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ చిత్రీకరణ కొనసాగించాం. 'ఇండియన్-2' చిత్ర నిర్మాణ సంస్థ లైకా వాళ్లతో మేం ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు కూడా సినిమాని త్వరగా పూర్తి చేయాలని ఆశగా ఉన్నారు. త్వరలోనే షూట్‌లో పాల్గొని, వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే కేవలం ఒక సినిమాపైనే పదేళ్లు వర్క్ చేయలేం కదా. రాజ్ కమల్ ఫిల్మ్స్ అనే పేరుతో నాకొక నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కి ఎస్. ప్రొడెక్షన్స్ ఉంది. ఈ రెండు సంస్థల్ని మేమే పోషించాలి. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి" అని కమల్ అన్నారు.