F3 Movie Success Celebrations: 'ఎఫ్ 2' కంటే 'ఎఫ్ 3' ఘన విజయం సాధించబోతుందని ఆ చిత్ర దర్శక నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఎఫ్ 3' విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతున్నారని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. కథ విన్నప్పుడు ఎలాంటి అంచనాలున్నాయో రిలీజ్ రోజు ఆ అంచనాలు నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. కథానాయకులు విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో కలిసి తన కార్యాలయంలో కేక్ కట్ చేసి 'ఎఫ్ 3' విజయోత్సవం జరుపుకున్నారు దిల్‌రాజు. 'ఎఫ్ 3' చిత్రం పిల్లలు, పెద్దలందరికీ నచ్చుతుందని, మళ్లీ మళ్లీ చూస్తారని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కమల్ 'విక్రమ్' సాంగ్.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు విశ్వనటుడు కమల్‌హాసన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'విక్రమ్'. లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్' తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్ హాసన్ ఆలపించారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా, అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో కమల్ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.
'బ్రహ్మాస్త్ర' కుంకుమలా సాంగ్.. బ్రహ్మాస్త్ర సినిమాతో సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రణ్‌బీర్ కపూర్, అలియా భట్. పెళ్లి తర్వాత వీరిద్దరి కలయికలో విడుదలవుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. దక్షిణాది భాషలకు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి కుంకుమలా పాటను శుక్రవారం ఆయన విడుదల చేశారు.